శివ, గరుడ న్యూస్ ప్రతినిధి, పార్వతీపురం
ప్రైవేటు ఆసుపత్రులు వైద్యారోగ్యశాఖ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. భాస్కరరావు పేర్కొన్నారు. ఈ మేరకు సాలూరులో ప్రైవేటు ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫిలడెల్ఫియా లెప్రసీ హాస్పిటల్, జ్యోతి హాస్పిటల్ మరియు స్కానింగ్ సెంటర్స్, మామిడిపల్లి లో లక్ష్మీ డయాగ్నొస్టిక్ సెంటర్ లను తనిఖీ చేసి నిర్దేశించిన మార్గదర్శకాలు,నిబంధనలు ఏ మేరకు అమలు చేస్తున్నారో పరిశీలించారు. ఆసుపత్రి రిజిస్ట్రేషన్,రెన్యువల్ కు సంబంధించి ధృవపత్రాలను పరిశీలించారు. రికార్డులు పరిశీలించి ఆసుపత్రిలో తనిఖీలు, పరీక్షలకు వచ్చిన వారి వివరాలు స్పష్టంగా పూర్తి స్థాయిలో నమోదు చేయాలని ఆదేశించారు.ల్యాబ్ రికార్డులు తనిఖీ చేశారు. వైద్య పరీక్షలు,ఆరోగ్య తనిఖీల రుసుము వివరాలు ఆసుపత్రిలో ప్రదర్శించాలన్నారు. ఆసుపత్రిలో బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ పై ఆరా తీశారు. అనంతరం ఆసుపత్రిలో స్కానింగ్ కేంద్రాలను తనిఖీ చేసి పిసిపిఎన్డిటి యాక్ట్ నిబంధనలు పాటిస్తున్న తీరు,సంబంధిత పోస్టర్స్ అక్కడ ప్రదర్శించినదీ,లేనిదీ పరిశీలించారు.గర్భిణీ స్కానింగ్ వివరాలు ఫార్మ్ ఎఫ్ లో విధిగా నమోదు చేయాలన్నారు.శస్త్ర చికిత్సలు నిర్వహించేటప్పుడు తప్పనిసరిగా అనస్థీషియా డాక్టర్ అందుబాటులో ఉండాలన్నారు. ఆసుపత్రిలో ఫైర్ సేఫ్టీ విధానం పై పరిశీలించి పరికరాల పనితీరు, వివియోగం పై సిబ్బందికి నైపుణ్యం ఉండాలన్నారు.ఆరోగ్య సూచనలు తెలియజేసే పోస్టర్లు ఆసుపత్రిలో ప్రదర్శించాలన్నారు. ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు పాటించాలని, ఏవిధమైన లోపాలు గుర్తించినా తగు శాఖా పరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఆరోగ్య కార్యాలయ డెమో వి. సన్యాసిరావు,వై.యోగీశ్వర రెడ్డి, సిసి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.




