సమాజంలోని ప్రతి పురుషుడు అభివృద్ధి పథంలో నడిచేందుకు మహిళే ప్రధాన ఆధారంగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పార్వతీపురం లోని టిటిడి కళ్యాణ మండపంలో శనివారం ఏర్పాటు చేసిన సభలో మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. తాను ఈ స్థాయికి ఎదిగానంటే తన తల్లి వెన్ను తట్టి ఈ స్థాయికి తీసుకొచ్చిందన్నారు. ప్రతి ఒక్కరూ తల్లి రుణం తీర్చుకోవాలని అన్నారు. రాష్ట్రంలోని మహిళల ఆర్థిక స్వావలంబనకు, వారి అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వమే మొదట ముందుకు వచ్చిందన్నారు. డ్వాక్రా మహిళా సంఘాల ఏర్పాటు, వారికి పావలా వడ్డీ రుణాలు అందించడంలో తెదేపా ప్రభుత్వమే కృషి చేసిందన్నారు.
ఈ సందర్భంగా ఆయన సభకు హాజరైన మహిళలందరికీ శిరస్సు వంచి నమస్కరించారు. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళ ఆర్థికాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు అనంతరం బాల్య వివాహాల నియంత్రణకు తాను కూడా కృషి చేస్తానంటూ ఏర్పాటు చేసిన బ్యానర్ పై తొలి సంతకం చేశారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు, మహిళలు పాల్గొన్నారు.