అన్నదాన సత్రాలు కూల్చడం ఏ సనాతన ధర్మం? “అభినవ సనాతనీ” ఏలుబడిలో సాగుతున్న అధర్మం

Garuda Tv
5 Min Read

తిరుపతి గరుడ న్యూస్ ప్రతినిధి: దాదాపు 40 ఏళ్లుగా కుల, మతాలకు అతీతంగా అందరికీ అన్నం పెడుతున్న ఓ అన్నదాన సత్రాన్ని, ఆశ్రమాన్ని కడప జిల్లాలో కూల్చివేశారు. సనాతన ధర్మాన్ని కాపాడుతానని పదే, పదే ప్రకటనలు చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని అటవీ శాఖ అధికారులు కడప జిల్లాలో ఈ ఆశ్రమాన్ని కూల్చివేశారు.

‘కాశీనాయుని జ్యోతి క్షేత్రంగా’ ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతం నల్లమల అడవి లో ఉంది. కడప జిల్లా బద్వేలు నియోజవర్గం, కాశీనాయన మండలం పరిధిలో ఈ క్షేత్రం నెలకొల్పబడింది. ఒక మండలం పేరే కాశీనాయుని మండలం గా ప్రసిద్ధి చెందిందంటే ఈ ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటో పాఠకులకు అర్థమవుతుంది. అవధూత కాశి నాయన 1995లో ఇక్కడ సమాధి కావించబడ్డారు. ఆయన జీవించి ఉన్న రోజుల్లోనే ఈ ప్రాంతంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా అన్నదానం చేసేవారు. అన్ని దానాల్లో కెల్లా అన్నదానమే ప్రాశస్త్యమైందని దీన్ని అందరూ పాటించాలని ఉపదేశాలు ఇచ్చేవారు. కాశీ అన్నపూర్ణేశ్వరి ఆలయాన్ని ఈ ప్రాంతంలో నిర్మించి ఆకలితో జీవులు ఉండకూడదన్న సంకల్పంతో కడుపునిండా అన్నం పెట్టడమే తన లక్ష్యంగా ఆయన ఈ ఆశ్రమాన్ని నడిపారు. గత 45 ఏళ్లుగా ఈ అన్నదాన సత్రం లక్షల మంది ఆకలిని తీర్చింది. రోజురోజుకు వృద్ధి చెందుతూ వేల నుంచి లక్షల సంఖ్యలో కి చేరింది. కాశీనాయుని జ్యోతి క్షేత్రంలో తొమ్మిది ఆలయాలు నిర్మాణమై ఉన్నాయి. కాశీ అన్నపూర్ణాదేవి ఆలయాన్ని కాశీనాయన ప్రతిష్ట చేయగా అనంతర కాలంలో కాశీ విశాలాక్షి, కాశీ రాజరాజేశ్వరి, కాశీ విశ్వనాథ స్వామి, కాశీ అన్నపూర్ణమ్మ, దత్తాత్రేయ, లక్ష్మీనరసింహస్వామి, రాములవారు, ఆంజనేయ స్వామి వారి ఆలయాలను భక్తులు నిర్మించారు.

కాశీనాయన వారికి గోవులంటే అమితమైన ప్రేమ. ఆయన జీవించిన కాలంలో ఎంతో ప్రేమగా పెంచుకున్న గోమాత మరణిస్తే ఇక్కడి ప్రజలు ఆ గోవుకు సమాధిని నిర్మాణం చేసి గోమాతను దేవునిగా కొలుస్తున్నారు. కాశీనాయన సంస్మరణార్థం గోవులను సంరక్షించడానికి 500 లకు పైగా గోవులను కాపాడుతూ పెద్ద గోశాలను నడుపుతున్నారు. కాశీనాయన జ్యోతి క్షేత్రంలో అత్యంత ప్రజాదరణను పొందింన కార్యక్రమం అన్నదానం. కాశీనాయన వర్ధంతి రోజున మూడు లక్షల మందికి పైగా భక్తులు ఇక్కడ భోజనాలు చేస్తుంటారు. ప్రతిరోజు ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడి ఆశ్రమ_ నిర్వాహకులు ఉదయం 3:30 గంటల నుంచి ఈ పనుల్లో తలమునకలై ఉంటారు. ఇక్కడ భోజనం చేయడానికి కుల, మతాలను పట్టించుకోరు. ఏ ప్రాంతం వారన్నది చూడరు. ఎన్ని రోజులు ఉంటారని అడగరు. ఎవరైనా ఎప్పుడైనా రాత్రయినా, పగలైనా ఎప్పుడూ భోజనం అందుబాటులో ఉండేటట్టుగా ఈ ఆశ్రమ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ క్షేత్రం సేవకు తోడ్పడేందుకు ఆర్యవైశ్యులు ఓ సత్రాన్ని, రెడ్డి సంఘం వారు ఓ సత్రాన్ని, రజకులు, కుమ్మరులు రెండు సత్రాలను నిర్మించారు. రజకులు, కుమ్మరులు నిర్మించుకున్న సత్రాలను అటవీ అధికారులు కూల్చివేశారు. 500 గోవులున్న గోశాలను ఇక్కడి నుంచి కూటమి ప్రభుత్వం బలవంతంగా తరలించింది. ఇక్కడి శిల్ప సంపద కూడా అద్భుతంగా ఉంటుంది. ప్రజలు తండోపతండాలుగా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లలో అందించే భోజనం కంటే 100 రెట్లు ఎక్కువ భోజనం, మరియు నాణ్యతతో ఇక్కడ ప్రజలకు ఉచితంగా అందిస్తుంటారు. అలాంటి ఉచిత అన్నదాన సత్రాన్ని, ఆశ్రమాన్ని ఏకపక్షంగా కూటమి ప్రభుత్వం కూల్చివేసింది. సనాతన ధర్మానికి దన్ను తానేనని పదేపదే చెప్పుకునే పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని అటవీ విభాగం వారు ఈ ఆశ్రమంపై దాడికి పాల్పడి బుల్డోజర్ లతో కూల్చివేయడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కాశీనాయుని క్షేత్రాన్ని తాము ఎంతో పవిత్రంగా భావించి అభివృద్ధి పరచుకున్నామని కూటమి ప్రభుత్వం కూలగొట్టడాన్ని తమ మనోభావాలపై దాడిగా ఈ ప్రాంత ప్రజలు భావిస్తున్నారు. దీంతో అన్ని రాజకీయ పక్షాలు, వివిధ ధార్మిక సంఘాలు ఈ సమస్యపై గళ మెత్తాయి.

అన్నమాచార్య పీఠం పీఠాధిపతి విజయ శంకర స్వామి, అచలానంద ఆశ్రమ పెద్దలు ఈ ప్రాంతాన్ని సందర్శించి తమ ఆవేదనను వెల్లడించారు. అన్నదాన సత్రం పై, హిందూ ధార్మిక క్షేత్రంపై జరిగిన దాడిపై 17 వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వేలాది మందితో నిరసన తెలియజేస్తున్నట్టు విజయ శంకర స్వామి ఓ ప్రకటన చేశారు. ప్రకటన వెలువడిన తరువాత మంత్రి లోకేష్ జరిగిన ఘటనకు క్షమాపణ చెబుతున్నానని, తన సొంత నిధులతో కూలిన నిర్మాణాలను తిరిగి నిర్మిస్తామని, జరిగిన పొరపాటుకు చింతిస్తున్నామని నష్ట నివారణ ప్రకటన చేశారు. ఇదే అంశంపై దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ కాశి నాయుని జ్యోతి క్షేత్రం టైగర్ జోన్ పరిధిలో ఉన్న కారణంగా అటవీ శాఖ అధికారులు తమకు తెలియకుండానే కూల్చివేతలకు సిద్ధమయ్యారని దీనిని నివారించడానికి తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని వెల్లడించారు. ఇదే అంశంపై పలువురు ప్రజాప్రతినిధులు శాసనసభలో తమ గళాన్ని వినిపించారు. నష్ట నివారణకై ప్రభుత్వం నానా తంటాలు పడుతున్నది. వాస్తవంగా ఈ కూల్చివేతలను అడ్డుకోవాల్సిన… తనను తాను అపర సనాతన వాదిగా ప్రకటించుకున్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంతవరకు నోరు తెరవకపోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు ఉన్నాయి. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కి తెలిసే ఈ కూల్చివేతలు జరిగాయని ఈ సందర్భంగా పలువురు వ్యాఖ్యానాలు చేశారు. హిందూ ధర్మ రక్షకులమంటూ లక్షల మందితో విజయవాడలో కోట్లాది రూపాయల ఖర్చులతో భారీ సభలు నిర్వహించిన ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ వీటితో అంట కాగుతున్న బిజెపి నోరు తెరవకపోవడం విచిత్రం. తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంలో తీవ్రంగా స్పందించి దీక్ష చేపట్టిన అభినవ సనాతన వాది పవన్ కళ్యాణ్ నేరుగా ప్రాతినిధ్యం వహిస్తున్న అటవీ శాఖలో ఈ స్థాయిలో కూల్చివేతలు జరుగుతుంటే మౌనంగా ఎందుకు ఉన్నట్టో అర్థం కాదు. అరణ్యాలను అదానీలకు పాలకులు కట్టబడుతున్న కాలంలో గిరి పుత్రులను అటవీ ప్రాంతాల నుంచి తరిమివేసి భూగర్భ ఖనిజాలకై తాపత్రయపడుతున్న నేపథ్యంలో కాశీనాయుని క్షేత్రంలో జరుగుతున్న కూల్చివేతల వెనుక టైగర్ జోన్ల సమస్య కంటే కార్పొరేట్ కంపెనీలకు కట్టపెట్టేందుకు జరుగుతున్న కుట్రగా పలువురు భావిస్తున్నారు. హిందుత్వ – కార్పొరేట్ బంధం ఇలాంటి సమయంలో మరింత స్పష్టంగా అవగతమవుతుంది. అందుకనే అపర అభినవ ‘సనాతనవాది’ నోరు తెరవలేదన్న విమర్శ లేకపోలేదు : కందారపు మురళి తిరుపతి.

- Advertisement -
Ad image
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *