

వేసవి వేడిమి దృష్ట్యా చలివేంద్రియాలు విస్తృతంగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ చెప్పారు. వేసవి వేడిమి, ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ ఎస్) తగితర అంశాలపై జిల్లా కలెక్టర్ జిల్లా, మండల స్థాయి అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వేడిమి పెరిగిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అత్యవసర పనులు ఉంటే బయటకు రావాలని ఆయన అన్నారు. టోపీ, గొడుగు వంటి వస్తువులు నీడ కోసం వాడాలని ఆయన అన్నారు. తెల్లని వదులు దుస్తులు వేసుకోవడం మంచిదని ఆయన చెప్పారు. ఉపాధి హామీ ప్రదేశాల్లో సైతం నీడ ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. వేతనదారులకు నీరు అందుబాటులో ఉంచాలని ఆయన చెప్పారు. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో ఉపాధి హామీ పనులు చేపట్టకుండా సమయాల్లో మార్పులు చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ నీరు ఎక్కువగా తాగాలని, శరీరం డీ హైడ్రేషన్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. వడ దెబ్బ తగలకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని ఆయన చెప్పారు. ఎక్కువ సేపు ఎండలో ఉండి అతి చల్లని పదార్థాలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని ఆయన హితవు పలికారు. ఎండలో ఎక్కువ సేపు తిరిగి చల్లని నీటిని తలపై వేసుకోవడం వలన కూడా వడ దెబ్బ తగిలే అవకాశాలు ఉంటాయని ఆయన అన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న వేడిమి దృష్ట్యా ప్రతి ఒక్కరూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరం మేరకు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవడం, కొబ్బరి బొండాలు పానీయాలు తీసుకుని ఆరోగ్యం కాపాడుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి కె హేమలత, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
