


జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఫారం పాండ్లను నిర్మించి, వాన నీటిని ఒడిసిపడదామని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ రైతులకు పిలుపు నిచ్చారు. తద్వారా భూగర్భ జలాలను పెంపొందించుకొని, అవసరమైన సమయంలో నీటిని వినియోగించుకునే సౌలభ్యం కలుగుతుందని అన్నారు. ప్రపంచ జల దినోత్సవం సందర్బంగా గరుగుబిల్లి మండలం కొంకడివరం గ్రామంలో సామూహిక ఫారం పాండ్స్ పనులు డ్వామా ఆధ్వర్యంలో శనివారం జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వయంగా గుణపం పట్టి మట్టిని తవ్వి ఫారం పాండ్ల పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్త ప్రాణకోటికి జలమే ఆధారమని, జలం లేనిదే.. జీవం లేదని అన్నారు. అటువంటి జలాల ఆవశ్యకతను తెలుసుకొని, వాటిని సంరక్షించు కోవడమే ప్రపంచ జల దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు. మంచినీటి విలువ గురించి అవగాహన పెంచడానికి, మంచినీటి వనరులను తెలివిగా ఉపయోగించుకునేలా పిలుపు నిచ్చేందుకు ప్రతి ఏడాది మార్చి 22న ప్రపంచ జల దినోత్సవంను జరుపు కుంటున్న సంగతిని కలెక్టర్ గుర్తుచేశారు. ప్రాణాధారమైన జలాలను ఒడిసి పట్టుకోకుంటే భవిష్యత్తులో నీటి కష్టాలు తప్పవని, వేగంగా పడిపోతున్న భూగర్భ జలమట్టాలను పెంచుకోవడం మానవాళికి చాలా అవసరమని తెలిపారు. జలనిధిలో ప్రజా భాగస్వామ్యం పెరిగేలా గ్రామాల్లోని ప్రజలను, రైతులను అధికారులు చైతన్యపరుస్తున్నారని అన్నారు.
