
రైల్వే స్టేషన్ కు వచ్చి వెళ్లే వారి వాహనాల కోసం జనరల్ పార్కింగ్ ఏర్పాటు చేయండి
అవసరార్థం వచ్చిన వారి వాహనాలు ఎక్కడ పార్క్ చేయాలో నిర్దేశించండి
రైల్వే స్టేషన్ ముందు పార్కు చేసిన వాహనాలకు గొలుసులు, తాళాలు, ఫైన్లు, కేసులు పద్ధతి విరమించాలి
ప్రయాణికులు సౌకర్యార్థం రైల్వే పని చేయాలి
రైల్వే స్టేషన్లో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడండి
గంజాయి లాంటి మాదకద్రవ్యాలు రవాణా కాకుండా చూడండి
రైల్వే పోలీస్ అధికారులను కోరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
పార్వతీపురం రైల్వే స్టేషన్ వద్ద వాహనాలు పార్కు చేస్తే వాహనాలకు గొలుసులు తాళాలు, ఫైన్ లు, కేసులు వేస్తారా…? అని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నించారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ ఓబీసీ జిల్లా చైర్మన్ వంగల దాలినాయుడు, మండల అధ్యక్షులు తీళ్ల గౌరీ శంకరరావు సబ్ ఇన్స్పెక్టర్ ఇగ్నేష్ కుల్లు ను కలిసి రైల్వే స్టేషన్ వద్ద వాహనాల పార్కింగ్ ప్రజల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైల్వే స్టేషన్ కు తమ వారిని డ్రాప్ చేయడానికి, రిసీవ్ చేసుకోవడానికి, రిజర్వేషన్ల కోసం, రైళ్ళ సమాచారం తెలుసుకునేందుకు వచ్చినవారు తమ వాహనాలను తాత్కాలికంగా కొద్ది సమయం స్టేషన్ ముందు ఉంచితే ఇటీవల ఆయా వాహనాలకు గొలుసులతో తాళాలు వేసి, ఫైన్లు వేసి, ఆపై కేసులు పెడుతున్నట్లు పలువురు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. రైల్వే స్టేషన్ ముందు జనరల్ పార్కింగ్ లేకపోవడంతో కొన్ని తరాలుగా వస్తున్న అలవాటు ప్రకారం రైల్వే స్టేషన్ ముందు పార్కు చేస్తున్నారన్నారు. అటువంటి వారి వాహనాలకు తాళాలు, ఫైన్లు, కేసులు వేయటం సరికాదన్నారు. కొద్దిసేపు పనుల నిమిత్తం వచ్చినవారు పెయిడ్ పార్కింగ్లో తమ వాహనాలను ఉంచలేరు అన్నారు. కాబట్టి జనరల్ పార్కింగ్ స్థలాన్ని కేటాయించాలన్నారు. జనరల్ పార్కింగ్ స్థలాన్ని కేటాయించకుండా, స్టేషన్ ముందు పార్కు చేసిన వాహనాలకు ఇలా తాళాలు, ఫైన్లు, కేసులు పెట్టడం సరికాదన్నారు. తక్షణమే జనరల్ పార్కింగ్ స్థలాన్ని చూపించాలన్నారు. అలాగే రైల్వే స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వాటిని కంట్రోల్ చేయాలి అన్నారు. ఒడిస్సా నుండి నిబంధనలకు విరుద్ధంగా సరైన అనుమతులు బిల్లులో లేని సరుకులు దిగుమతి అవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. గంజాయి లాంటి మాదకద్రవ్యం రవాణా జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయన్నారు. రైల్వే స్టేషన్లో పలుమార్లు గంజాయి పట్టుబడిన సంఘటనలు గుర్తు చేశారు. వాటి నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రయాణికులు సౌకర్యార్థం రైల్వే పని చేయలే తప్ప వారిని ఇబ్బంది పెట్టకూడదన్నారు. ఈ సందర్భంగా వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమం తమ పార్టీ ఇన్చార్జ్ బత్తిన మోహనరావు ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగిందన్నారు. దీనికి స్పందించిన సబ్ ఇన్స్పెక్టర్ ఇగ్నేష్ కుల్లు మాట్లాడుతూ జనరల్ పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. చేసిన ముందు వాహనాలు పార్కు చేస్తే ఫైన్ తప్పదని బోర్డులు ఏర్పాటు చేశామన్నారు.



