
తిరుపతి జిల్లా, పాకాల గరుడ న్యూస్ (ప్రతినిధి): ఏప్రిల్ 3: నేల స్వభావాన్ని బట్టి ప్రతి ఏడు రోజుల నుంచి పది రోజులకు 500 లీటర్ల వరకు నీటిని ప్రతి చెట్టుకు అందించాల ని ఉద్యానవన శాఖ అధికారిణి శైలజ అన్నారు. పాకాల మండలం గోర్పాడు గ్రామంలోని మామిడి తోటలను ఆమె గురువారం పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం మామిడి పెద్ద నిమ్మకాయ, కోడిగుడ్డు సైజు పరిమాణంలో ఉన్నాయని, రైతులు నేల స్వభావాన్ని బట్టి 7నుండి10రోజులకు ఒకసారి 300లీటర్ల నుండి 500లీటర్ల నీటిని ప్రతి చెట్టుకు అందించాల్సి ఉంటుందని తెలిపారు. చెట్లకు నీటిని కొందరు పాదులలో ఎక్కువ మంది రైతులు డ్రిప్ పద్దతిలో పెట్టడం జరుగుతోందనీ తెలిపారు. డ్రిప్ లో నీరు పెట్టినప్పుడు రైతులు కొన్ని జాగ్రత్తలు పాటించాలనీ, డ్రిప్ లేటరల్ పైపును చెట్టు మొదలు చుట్టూ కాకుండా పాదులలో అమర్చుకుని నీటిని అందించాలని అన్నారు. చెట్టు కెనొపి పరిధిలో పిల్ల వేరు వ్యవస్థ ఉండి తగినంత నీటిని, పోషకాలను అందించడం జరుగుతుంది. అలా కాకుండా ప్రతి రోజూ నీరు అందించడం వలన ఈ వేరు వ్యవస్థకు గాలి తగలక, పోషకాలను అందించక పోవడం వలన సాధారణముగా పిందె రాలడం కంటే ఎక్కువ శాతం పిందె రాలడం, పురుగులకు మరియు తెగుళ్ళకు అనుకూల వాతావణంగా మారి కాయ నాణ్యత దెబ్బ తినే అవకాశం ఉంటుందని చెప్పారు. రైతులు చెట్టుకు అవసరమైనంత మాత్రమే నీరు ఇవ్వాల్సి ఉంటుందన‌్నారు. కాయ నాణ్యత కొరకు కాయ కోత కోసే 15 రోజుల ముందుగా చెట్లకు నీరు పెట్టడం ఆపివేయాలని తెలిపారు. తోటలలో ఎక్కడైనా తొడిమ కుళ్ళు, కాయ తొలుచు పురుగు, కాయలపైన బంక కారడం గమనించినప్పుడు నివారణకు రైతులు కాపర్ ఆక్సీ క్లోరైడ్3గ్రా.ఎసిపేట్ 1.5 గ్రా(లేదా)ఎమామెక్టిన్ బెంజోయేట్-0.5 గ్రా.కాల్షిబోర్(కాల్షియం+బోరాన్)2 గ్రా.మరియు జిగురు 0.5 మి.లీ.ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలని వివరించారు. పది సంవత్సరాల పైబడిన చెట్లకు 2 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్,250 గ్రా.యూరియా,500 గ్రా.పొటాష్ కలిపి చెట్ల పాదులలో వేసి నీరు పెట్టడం వలన,కాయ రంగు,రుచి,బ్రిక్స్ పెరిగి నాణ్యమైన పంట దిగుబడిని పొందవచ్చని గ్రామ రైతులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైతులు వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు.

