గోదావరి జిల్లా, కొత్తపేట గరుడ న్యూస్ (ప్రతినిధి): మత సామరస్యాన్ని దాటుతూ అంబేద్కర్ కోనసీమ జిల్లా అలమూరు మండలం మడికి శివారు చిలకలపాడులో ఆదివారం జరిగిన శ్రీరామనవమి వేడుకలలో రామాలయం వద్ద అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ చేసారు. సీతారాముల కళ్యాణం వేడుకలలో బాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ జిల్లా అధ్యక్షులు షేక్ సుల్తాన్ మాట్లాడుతూ
అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ వ్యవస్థాపకులు హజ్రత్ మిర్జా గులాం అహ్మద్ శ్రీరామచంద్ర మహారాజు, శ్రీకృష్ణ మహారాజుల్ని గొప్ప దైవ సందేశ హరులుగా పేర్కొన్నారుని, సర్వ మతాల సారాంశం ఒకటేనని బోధించారనీ, ఇలాంటి మతసామరస్య కార్యక్రమాలను దేశవ్యాప్తంగా కమ్యూనిటీ నిర్వహిస్తోందని అన్నారు. జిల్లా ఇంచార్జ్ మహమ్మద్ సిరాజ్ మాట్లాడుతూ హజ్రత్ మిర్జా గులాం అహ్మద్ (అ.స) 1889వ సంవత్సరంలో పంజాబ్ రాష్ట్రం ఖాదియాన్ నగరంలో అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీని స్థాపించారని, వారు ఇస్లాం వ్యవస్థాపకులు ముహమ్మద్ ప్రవక్త చేసిన భవిష్యవాణి ప్రకారం తానే వాగ్దాత్త మసీహ్ అని ప్రకటించారు. ఈ కమ్యూనిటీ నేడు ప్రపంచవ్యాప్తంగా 200కి పైగా దేశాల్లో శాంతి, సమానత్వం, న్యాయం మరియు మతసామరస్యంతో కూడిన సమాజ నిర్మాణాన్ని లక్ష్యంగా చేసుకొని, ‘అందరిని ప్రేమించు – ఎవ్వరినీ ద్వేషించకు’ అనే నినాదంతో ‘హ్యూమానిటీ ఫస్ట్’ శాఖ ద్వారా మానవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు. కమ్యూనిటీ ప్రస్తుత ఖలీఫా హజ్రత్ మిర్జా మస్రూర్ అహ్మద్ నేతృత్వంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు దొండపాటి సుబ్బరాజు, కొత్తపల్లి నగేష్ , ఈదర రమేష్, కొత్తపల్లి కృష్ణ, కమ్యూనిటీ రాష్ట్ర ప్రజా సంబంధాల ప్రతినిధి మహమ్మద్ జావిద్ అహ్మద్, మౌల్వి ముహమ్మద్ అక్బర్, మీను పాషా, గుల్ మీరా తదితర గ్రామ పెద్దలు పాల్గొన్నారు.




