మల్టీ స్పెషాలిటీ సేవలు ఇంకెప్పటికో…?!

Sivaprasad Patro
Sivaprasad Patro - Staff reporter
2 Min Read

సుమారు నాలుగేళ్లు గడిచినా పూర్తికాని పనులు

త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలి

మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలి

జిల్లా ఆసుపత్రి ఆధునీకరణ పనులు అదనపు భవనం నిర్మాణాలు పూర్తి చేయాలి

జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందాలి

జిల్లా ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి


పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలకు మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు ఎప్పుడని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నించారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఓబిసి పార్వతీపురం మన్యం జిల్లా చైర్మన్ వంగల దాలి నాయుడు, సాలూరు నియోజకవర్గం ఇంచార్జ్ గేదెల రామకృష్ణ, పార్వతీపురం మండల అధ్యక్షులు తీళ్ల గౌరీ శంకరరావు తదితరులు నిర్మాణంలో ఉన్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తరాలు మారుతున్నా పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలు మల్టీ/ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలకు నోచుకోవటం లేదన్నారు. ఈ విషయంలో గతంలో వైసిపి, ఇప్పుడు కూటమి ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. గత నాలుగేళ్లుగా మల్టీస్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు నత్త నడక నడుస్తున్నాయన్నారు. తక్షణమే కాంట్రాక్టర్లకు పూర్తిస్థాయి బకాయి బిల్లులు చెల్లించి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పూర్తయ్యల చర్యలు తీసుకోవాలని కోరారు. పార్వతీపురంలో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ నిర్మాణం జరిగేలా ప్రయత్నం చేయాలన్నారు. నాణ్యమైన పనులతో త్వరితగతిన పూర్తయ్యేలా పాలకులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సైట్ ఎల్. దుర్గాప్రసాద్ తో మాట్లాడి ఆస్పత్రి నిర్మాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అత్యవసర సేవలు అందించే ఆసుపత్రి పనులు నాసిరకంగా లేకుండా చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం వారు భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం జిల్లా ఆస్పత్రిలో నిర్మాణంలో ఉన్న అదనపు భవనం నిర్మాణంతోపాటు ఆధునీకరణ పనులు పూర్తి చేయాలన్నారు. 150 పడకల సామర్థ్యానికి తగ్గట్టు మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న వైద్య సిబ్బంది పోస్టులను తక్షణమే భర్తీ చేయాలన్నారు. ఐసీయూ, ప్లంబర్, ఫార్మసిస్ట్, దోబి, ఎక్సరే, ఈసీజీ తదితర విభాగాలలో సరిపడా సిబ్బంది లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే వైద్యులు సమయపాలన పాటించేలా, రిఫరల్ కేసులు తగ్గేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఉన్నతాధికారులు, పాలకులు స్పందించి వీలైనంత త్వరగా మల్టీస్పెషలిటీ సేవలు పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలకు అందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం తమ పార్టీ ఇంచార్జ్ బత్తిన మోహనరావు ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగిందన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *