
జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్/జాయింట్ కలెక్టర్ ను కోరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
తనకి అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆశ్రయించిన బాధితురాలు
జిల్లాలో ఆరోపణలు మూటగట్టుకుంటున్న నియామకాలు
ధన బలం, రాజకీయ బలం ఉన్నవారికి, విలేకరి కుటుంబ సభ్యులకు కాకుండా అర్హులైన పేదవారికి న్యాయం జరగాలన్న భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు

ఇటీవల జిల్లాలో జరిగిన అంగన్వాడీ నియామకాలపై దర్యాప్తు చేయాలని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ పార్వతీపురం మన్యం జిల్లా ఓబీసీ చైర్మన్ వంగల దాలి నాయుడు, నియోజకవర్గ ఇన్చార్జ్ సిరిసిపల్లి సాయి శ్రీనివాస్, సాలూరు నియోజకవర్గం ఇంచార్జ్ గేదెల రామకృష్ణ, జిల్లా నాయకులు కోల కిరణ్ కుమార్, మండల అధ్యక్షులు తీళ్ల గౌరీ శంకరరావు తదితరులు పార్వతీపురం మన్యం జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్/ జాయింట్ కలెక్టర్ ఎస్ ఎస్ శోభికను కలిసి ఇటీవల నియామకాలు జరిగిన అంగన్వాడి ఉద్యోగాలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్వతీపురం మండలం, బాల గుడబ గ్రామానికి చెందిన చింతల ఉషారాణి అనే బాధితురాలు అంగన్వాడి నియామకాలలో తనకు అన్యాయం జరిగిందంటూ తమ కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించిందన్నారు. హెల్పర్ ఉద్యోగానికి ఆమె దరఖాస్తు చేసుకోగా, రోస్టర్ పాయింట్ల ప్రకారం, విద్యార్హత ప్రకారం ఆమెకు అర్హతలు ఉన్నప్పటికీ, వేరే వ్యక్తికి ఉద్యోగం కేటాయించారని, తనకు అన్యాయం జరిగిందంటూ, అంగన్వాడి ఉద్యోగి నియామకాల్లో లక్షలు చేతులు మారినట్లు గ్రామంలో చర్చ జరుగుతోందని ఆరోపిస్తూ… తనకు సాయం చేయాలంటూ కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించిందన్నారు. ఈ నేపథ్యంలో అంగన్వాడి నియామకాలపై దర్యాప్తు నిర్వహించాలని కోరారు. గతంలో జరిగిన విద్యా, వైద్య శాఖల్లో, రేషన్ డీలర్ల నియామకాలలో ఆరోపణలు వచ్చినట్లు గుర్తు చేశారు. వాటిని బట్టి చూస్తే అంగన్వాడీ నియామకాల్లో కూడా అవకతవకలు జరిగి ఉండొచ్చని తాము అనుమానిస్తున్నామన్నారు. కాబట్టి అంగన్వాడి నియామకాలపై దర్యాప్తు నిర్వహించి బాధితురాలకు న్యాయం చేయాలన్నారు. అర్హులైన పేదవారికి ఉద్యోగాలు దక్కాలే తప్ప, అంగ బలం, అర్థ బలం, రాజకీయ బలం ఉన్నవారికి , నాయకులు ఇచ్చిన పేర్లకు ఉద్యోగాలు కట్టబెట్టే పద్ధతి సరికాదన్నారు. అలా జరిగితే నోటిఫికేషన్లు ఇంటర్వ్యూలు ఇవన్నీ అనవసరమన్నారు. జిల్లాలో పాలన ఆరోపణలకు లోనవుతుందన్నారు. జిల్లాలో అర్హులకు దక్కాల్సిన ఉద్యోగాలు ధన బలం, రాజకీయ బలం ఉన్న నాయకులు, ఓ పత్రిక విలేఖరి కుటుంబ సభ్యులకు దక్కుతున్నాయన్నారు. దీన్ని జిల్లా ప్రజలు గమనిస్తున్నారన్నారు. అధికారులు అర్హులకు న్యాయం చేయాలన్నారు. ఈ సందర్భంగా బాధితురాలు కింతలి ఉషారాణి జాయింట్ కలెక్టర్ తో మాట్లాడుతూ తనకు తల్లిదండ్రులు, భర్త లేరని, ఉన్న ఇద్దరు పిల్లల్లో ఒకరు మానసిక వికలాంగుడని కుటుంబ పోషణ కష్టంగా ఉందని వాపోయారు. రోస్టర్ పాయింట్ల ప్రకారం తనకు 80 మార్కులు వస్తాయని, అన్ని అర్హతలు ఉన్న తనకు ఉద్యోగం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ విషయమై దర్యాప్తు నిర్వహించడం జరుగుతుందని ఇన్చార్జి జిల్లా కలెక్టర్ / జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం తమ పార్టీ ఇంచార్జ్ బత్తిన మోహన్ రావు ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగిందన్నారు.

