

మృత్యు సంకటంగా మృత్యుంజయ నగరం రోడ్డు…!
పెద్ద పెద్ద గోతులతో ప్రాణ సంకటంగా మారిన అంతర్రాష్ట్ర కొరాపుట్ రహదారి
గోతుల మయమైన రోడ్డును పట్టించుకోని పాలకులు, అధికారులు
గోతుల రోడ్డును పరిశీలించిన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు
పార్వతీపురం మండలంలోని మృత్యుంజయ నగరం ( ఎమ్మార్ నగరం ) రోడ్డు మృత్యు సంకటంగా మారిందని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. మంగళవారం కాంగ్రెస్ ఓ బి సి మన్యం జిల్లా చైర్మన్ వంగల దాలి నాయుడు, జిల్లా నాయకులు కోలా కిరణ్ కుమార్, మండల అధ్యక్షులు తీళ్ళ గౌరీ శంకరరావు, సాలూరు నియోజకవర్గం ఇంచార్జ్ గేదెల రామకృష్ణ తదితరులు పార్వతీపురం పట్టణ సమీపంలోని వెంకంపేట ఘోరీల నుండి ఎమ్మార్ నగరం వరకు గల గోతుల మయమైన రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్వతీపురం నుండి ఒడిశా కోరాపుట్ కు రాకపోకలు సాగించే రహదారి పెద్ద పెద్ద గోతులు ఏర్పడి ప్రాణ సంకటంగా మారిందన్నారు. వెంకంపేట గోరీల నుండి వెంకంపేట గ్రామం వరకు, ఎం ఆర్ నగరం వరకు గల రహదారులు పెద్దపెద్ద గోతులు ఏర్పడి ప్రజల రాకపోకులకు ఇబ్బందులు కలుగుతున్నాయి అన్నారు. పెద్ద పెద్ద గోతుల్లో పడిన వాహనాలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయన్నారు. పలువురు ప్రయాణికులు ప్రమాద భారిన పడిన సంఘటనలు లేకపోలేదన్నారు. వైసిపి పాలనంతా రోడ్లు గోతులేనని, వాటిని బూచిగా ప్రజలకు చూపించి అధికారంలోకి వచ్చిన కూటమి పాలకులు సంక్రాంతిలోగా రోడ్డు మరమ్మత్తులు చేపడతామని ప్రజలకు హామీ ఇచ్చారన్నారు. సంక్రాంతి పోయినా రోడ్డు మరమ్మత్తులు మాత్రం జరగలేదన్నారు. కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం అయిందన్నారు. కూటమి పాలకులు కూడా రోడ్డు బాగోగులపై చేతులెత్తేసారన్నారు. ఈ రహదారి గుండా పెద్దపెద్ద నాయకులు, అధికారులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారని, అటువంటివారు కనీసం ఈ రోడ్డు బాగాగులపై దృష్టి పెట్టకపోవడం బాధాకరమన్నారు. ఇక వర్షాలు పడితే రహదారి మొత్తం మరింత చిద్రమయ్యే పరిస్థితి ఉంటుందన్నారు. ఈ రహదారిలో ప్రయాణించే స్థానిక ప్రజలతో పాటు ఒడిశాకు చెందిన ప్రజలు కూడా అధికారుల తీరుకు విస్మయం వ్యక్తం చేస్తున్నారన్నారు. తక్షణమే సంబంధిత అధికారులు, పాలకులు స్పందించి వెంకంపేట గోరీల నుండి ఎమ్మార్ నగరం వరకు గల గోతుల మయమైన రహదారి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.
