
గరుడ న్యూస్, పాచిపెంట
నేలలో అధిక సేంద్రియ కర్బనం ఉంటే ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండానే అధిక దిగుబడులు సాధించడం సాధ్యమని వ్యవసాయ అధికారి కే.తిరుపతిరావు అన్నారు. విశ్వనాధపురం, మోసూరు గ్రామాలలో నిర్వహించిన ప్రతి పంటకు నవధాన్యాలు కార్యక్రమంలో పాల్గొంటూ భూములు నిస్సారం అవ్వడం వలన ప్రతి సంవత్సరం రసాయన ఎరువులను పెంచుకుంటూ వేయాల్సిన అవసరం వస్తుందని ఇది ఇలాగే కొనసాగితే నేల, పంట రెండు కూడా రసాయన ఎరువులకు స్పందించడం మానేస్తాయని కాబట్టి రైతులు పంటల అధిక దిగుబడుల కోసం పూర్తిగా రసాయన ఎరువుల మీదే ఆధారపడకుండా పంట వేయడానికి నెల రోజులు ముందుగా నవధాన్యాలు వేసుకుని కలియ దున్నుకుంటే భూమిలో సేంద్రియ కర్బన శాతం క్రమక్రమంగా పెరుగుతుందని ఇలా సేంద్రియ కర్బనాన్ని ఒక్క శాతం కంటే పైకి తీసుకు వచ్చినట్లయితే ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండానే అధిక దిగుబడులు సాధ్యమని తెలిపారు. నవధాన్యాలు వేయడం వలన భూమిలో జీవ వైవిధ్యం పెరుగుతుందని నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందని ఎండకు వానకు మృత్తిక కొట్టుకొని పోకుండా ఉంటుందని రాబోయే రోజులలో క్రమంగా కలుపు ఉధృతి పూర్తిగా తగ్గిపోతుందని ఇన్ని ప్రయోజనాలు ఉన్న నవధాన్యాలను రైతులు తప్పకుండా సాగు చేసి కలియదున్నాలని కోరారు. అనంతరం గ్రామాలలో నవధాన్యాలు వేద్దాం భూసారం పెంచుదాం అనే నినాదంతో ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు బాలకృష్ణ ,మోహన్ ప్రకృతి సేద్య ఎంటి యశోదమ్మ ఇతర ప్రకృతి సేద్య బృందం పాల్గొన్నారు.

