

ఎనిమిదేళ్లు అవుతున్నా అతి గతి లేని టిడ్కో గృహాలు
లబ్ధిదారులకు సొంతింటి కల సహకారం చేయండి
*ఆశగా ఎదురు చూస్తున్న పార్వతీపురం, సాలూరు లబ్ధిదారులు
టిడ్కో విషయంలో విఫలమైన వైసిపి, కూటమి పాలకులు
*జిల్లా కలెక్టరేట్ ఆవరణలో పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయండి
పార్వతీపురం సబ్ కలెక్టర్ ను కోరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
పార్వతీపురం, గరుడ న్యూస్ :
గత ఎనిమిది ఏళ్లుగా ఆశగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు తిట్కో ఇల్లు అప్పగించాలని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. సోమవారం పార్వతీపురం మండలం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ పార్వతీపురం మన్యం జిల్లా చైర్మన్ వంగల దాలి నాయుడు, మండల అధ్యక్షులు తీళ్ళ గౌరీ శంకరరావు తదితరులు సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ ను కలిసి టిడ్కో గృహాల సమస్యపై చర్చించారు. 2017లో అధికారంలో ఉన్న టిడిపి ప్రవేశపెట్టిన టిడ్కో గృహాలు ఇప్పటివరకు లబ్ధిదారులకు చేరలేదన్నారు. అప్పటి టిడిపి, తర్వాత వచ్చిన వైసిపి, ఇప్పటి కూటమి పాలకులు టిడ్కో గృహాల విషయంలో విఫలమయ్యారని ఆరోపించారు. సొంతింటి కల నెరవేరుతుందన్న ఆశ తో ఉన్న పార్వతీపురం, సాలూరు లబ్ధిదారులకు సొంతింటి కల నెరవేర్చాలన్నారు. పార్వతీపురానికి 1104, సాలూరు కు 1440 టిడ్కో గృహాలను మంజూరు చేశారన్నారు. వాటికోసం లబ్ధిదారుల నుండి కొంత మొత్తం డీడీలు రూపంలో లబ్ధిదారుని వాటా కూడా వసూలు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. మంజూరు చేసిన ఇళ్లలో కొన్ని రద్దు చేశారన్నారు. రద్దు చేసిన వారికి ఇప్పటివరకు డీడీలు చెల్లించలేదన్నారు. దీంతో వారు కూడా ఇల్లు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారన్నారు. అలాగే పార్వతీపురంలోని టిడ్కో గృహాల నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చిందన్నారు. డ్రైన్లు, రక్షణ గోడలు, పైప్ లైన్ పనులు పూర్తి కావాల్సి ఉందన్నారు. సాలూరులో గృహాల సముదాయం నిర్లక్ష్యానికి గురైందన్నారు. తక్షణమే టిడ్కో గృహాలు విషయమై దృష్టి సారించి లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా వినతిపత్రాన్ని అందజేశారు. దీనికి స్పందించిన సబ్ కలెక్టర్ తక్షణమే చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
కలెక్టరేట్ ఆవరణలో పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి
జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు సబ్ కలెక్టర్ ను కోరారు. వివిధ పనుల నిమిత్తం కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన ప్రజలు పబ్లిక్ టాయిలెట్స్ లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నారు. ప్రతి సోమవారం గ్రీవెన్స్ కి వచ్చిన ప్రజల అవస్థలు వర్ణనాతీతమన్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలన్నారు. దీనికి స్పందించిన సబ్ కలెక్టర్ తగు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
