

సినిమా హాల్ నిర్వహణలో అనుసరించాల్సిన నిబంధనలు తప్పక పాటించాల్సిందే నని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోబిక యాజమాన్యాన్ని ఆదేశించారు. మండలంలోని నర్సిపురం టీ బి ఆర్ థియేటర్ లో బుధవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఎం ఆర్ పీ ధరల ప్రకారం తినుబండారాల విక్రయం చేస్తున్నది లేనిది, కాలం చెల్లిన స్నాక్స్ ఉన్నాయా అని పరిశీలించి ఫుడ్ శాంపిల్ లను సేకరించాలని ఆహార భద్రత అధికారి రామయ్యను ఆదేశించారు. కెంటిన్ లో అమ్మకాల ధరలను చూశారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు భద్రతా ప్రమాణాలు, బయటకు వెళ్ళే దారిని నిశితంగా గమనించారు. సినిమా థియేటర్ నిర్వహణలో పారిశుధ్యం, భద్రతకు అధిక ప్రాధాన్యత నివ్వాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించి అనధికారికంగా సినిమా టికెట్ల అమ్మకాలు జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. మరుగుదొడ్ల నిర్వహణ, భద్రత కోసం ముందు జాగ్రత్తలు పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో తాసీల్దార్ జయలక్ష్మి, వి అర్ ఓ శంకర్ పట్నాయక్, విద్యుత్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

