
గరుడ న్యూస్ : నిజాయితీకి నిదర్శనంగా – బంగారు గొలుసును బాధితురాలికి తిరిగి అందజేసిన కానిస్టేబుల్‌ను అభినందించిన చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ చందోలు, ఐపిఎస్ .రోడ్డుపై దొరికిన సుమారు 2 లక్షల 50 వేల రూపాయలు విలువ గల 25 గ్రాముల బంగారు చైన్ ను చిత్తూరు జిల్లా ఎస్పీ చే బాధితురాలికి అప్పగింత. వివరాలు: 02-06-2025న మధ్యాహ్నం సుమారు 3.30 గంటలకు చిత్తూరు పట్టణము నందు గల షర్మన్ స్కూల్ కు ఎదురుగా ఉన్నటువంటి యూనియన్ బ్యాంకు నందు తన వ్యక్తిగత పనులకు వచ్చిన 190 రామాపురానికి చెందిన శ్రీమతి మునిలక్ష్మి పనులను పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో పొరపాటున ఆమె బంగారు చైన్ ను బ్యాగ్ నందు పెట్టుకోబోయి బ్యాంక్ బయట జారవిడుచుకొని వారి గ్రామానికి వెళ్ళిపోయారు. అదే సమయంలో జిల్లా ఎస్పీ బంగ్లా నందు విధులు నిర్వహిస్తున్న అన్వర్ బాష, PC 516, డ్యూటీ నిమిత్తం అటుగా వెళ్తూ చైన్ ను గమనించి ఆ చైన్ ను తీసుకొని చిత్తూరు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ కు వెళ్లి అక్కడ ఎవరైనా ఫిర్యాదు చేసారా అని తెలుసుకొని, అధికారుల ఆదేశాల మేరకు పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నందు సి.సి.కెమెరాల ద్వారా పరిశీలన జరిపి, యూనియన్ బ్యాంక్ సీసీ టీవీ ఫుటేజ్‌లో ఒక మహిళ తన గొలుసును పొరపాటున జారవిడిచినట్లు నిర్ధారించారు. 03-06-2025 న ఉదయం బాదితురలైన మునిలక్ష్మి ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా ఒకటవ పట్టణ ఇన్స్పెక్టర్ మహేశ్వర ఆమె చైన్ గురించి చెప్పిన వివరాల ప్రకారం ఆమెదేనని దృవీకరించి జిల్లా ఎస్పీ చేతుల మీదుగా బాధితురాలికి ఈరోజు అప్పగించడం జరిగినది.ఈ సందర్భంగా, ఎస్పీ కానిస్టేబుల్ అన్వర్ బాషా నిజాయితీని ప్రశంసిస్తూ, “ఇలాంటి ఉత్తమ ప్రవర్తన ప్రతి పోలీసు సిబ్బందికి మార్గదర్శకంగా నిలవాలి. అన్వర్ బాషా చూపిన నిజాయితీ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం” అని అభినందించారు.


