


పార్వతీపురం, గరుడ న్యూస్ : వైసీపీ నేతలు నిరసన కార్యక్రమం కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో గాయపడిన పెదపెంకీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులను టిడిపి నేతలు పరామర్శించారు. ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఆదేశాలతో టీడీపీ నేతలు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను మంగళవారం పరామర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యులను అడిగి విద్యార్థులకు అందిస్తున్న చికిత్స వివరాలు తెలుసుకున్నారు. నాణ్యమైన వైద్యం అందించాలని విద్యార్థులకు అవసరమైన సాయం తాము చేస్తామని టిడిపి నేతలు ప్రకటించారు. ఈ సందర్భంగా టిడిపి నేతలు మాట్లాడుతూ వైసీపీ నాయకులు తమ రాజకీయ స్వార్థం కోసం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారని వారి కుట్రలను ప్రజలు గమనిస్తున్నట్లు తెలిపారు. ప్రజల జీవితాలతో ఆటలాడుకునే వైసిపి నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను టిడిపి నాయకులు కోరారు.
