

27.06.2025: చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గం కొత్తపేట మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి): ఆర్ మంజునాథ్: కుప్పం విద్యా హబ్‌గా అభివృద్ధి చెందుతుంది
ద్రావిడ విశ్వవిద్యాలయానికి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు – ముఖ్యమంత్రికి విశ్వవిద్యాలయం కృతజ్ఞత. కుప్పం నియోజకవర్గంలో విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రాధాన్యతతో, ద్రావిడ విశ్వవిద్యాలయం పునరుజ్జీవింపబడుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ద్రావిడ విశ్వవిద్యాలయానికి కొత్తగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయడం పట్ల విశ్వవిద్యాలయం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. ఈ విద్యా సంవత్సరంలో నుంచే బి.టెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (CSE) మరియు CSE – ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & మెషీన్ లెర్నింగ్ (AI & ML) కోర్సులతో కళాశాల ప్రారంభం కానుంది. ఒక్కో కోర్సులో 60 సీట్లు కేటాయించబడ్డాయి. ఇది కుప్పం విద్యా రంగానికి సరికొత్త మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. ఇందులో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయానికి అన్ని విధాలుగా మద్దతు ఇస్తోంది. ఔట్సోర్సింగ్ సిబ్బందికి పెండింగ్ జీతాలుగా మొదటి దశలో రూ.2.86 కోట్లు, రెండవ దశలో రూ.5.2 కోట్లు విడుదల చేయడంతో పాటు, మూడేళ్లపాటు జీత భరోసా కొనసాగించేందుకు అంగీకరించడం విశేషం. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేశ్ గారికి, ఉన్నత విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ కోన శశిధర్ గారికి, APSCHE ఛైర్మన్ ప్రొఫెసర్ మధుమూర్తి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. వీరి సహకారం వల్లే ఈ అభివృద్ధి సాధ్యమైందని పేర్కొంది. కుప్పం విద్యా హబ్‌గా మారుతున్న ప్రయోజనాలు: కుప్పం నియోజకవర్గంలో ఇప్పటికే ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల, పాలిటెక్నిక్, డిగ్రీ మరియు బి.ఎడ్. కళాశాలలు ఉన్నాయి. తాజాగా మంజూరైన ఇంజనీరింగ్ కళాశాలతో కలిపి కుప్పం సమగ్ర విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం పేర్కొన్న ప్రయోజనాలు ఇవే: గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన, ఖర్చు తగ్గిన విద్య అందుబాటులోకి రాక. ఉపాధ్యాయులు, సిబ్బంది, మరియు అనుబంధ రంగాల్లో ఉద్యోగావకాశాల వృద్ధి. స్థానిక ఆర్థిక వ్యవస్థకు బలమైన వృద్ధి (హాస్టళ్లు, ట్రాన్స్‌పోర్ట్, వాణిజ్యాలు వృద్ధి). పరిశోధన, నూతన ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణం. చిత్తూరు జిల్లాలో విద్యా సమన్వయం మెరుగుపడి విద్యా ప్రమాణాలు పెరుగుతాయి.
ద్రావిడ విశ్వవిద్యాలయం తదుపరి లక్ష్యంగా, చిత్తూరు జిల్లాలోని UG, PG, B.Ed. కళాశాలలను అనుబంధంగా తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. “కుప్పాన్ని విద్యా కేంద్రముగా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి గారి సహకారం ఎనలేనిది. విద్యా రంగ పునాదులను బలపరిచే నిర్ణయాలని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎం.దొరస్వామి, రిజిస్ట్రార్ ఆచార్య వి. కిరణ్ కుమార్ కొనియాడారు. డాక్టర్ పి ఎస్ గణేష్ మూర్తి, పి ఆర్ ఓ, ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం

