


పార్వతీపురం, గరుడ న్యూస్ : రాజకీయాలను పక్కనపెట్టి గ్రామాలను అభివృద్ధి చేసుకోవడానికి ప్రజలందరూ కలిసి రావాలని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పిలుపునిచ్చారు. పార్వతీపురం మండలం కారాడవలసలో మంగళవారం తెల్లవారుజామునే వృద్ధులు, వికలాంగులకు,వితంతులకు ఆయన పెన్షన్లు పంపిణీ చేశారు. పెన్షన్ దారులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమపదకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కారాడవలస గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయిందని, అందరూ కలిసి వస్తే గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలిపారు. పారిశ్రామికవేత్తలతో మాట్లాడి త్వరలో ఇక్కడ కంపెనీ ఏర్పాటు చేస్తే యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఈ దశగా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. గ్రామంలో రోడ్లు, కాలువలు ఇతర మౌలిక వసతులు కల్పనకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రజలందరూ ఐకమత్యంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గత వైసిపి ప్రభుత్వం అభివృద్ధిని పక్కనపెట్టి నిధులు దోచుకోవడంతో గ్రామాలలో పరిస్థితి దారుణంగా తయారైందని ఆవేదన వెలిబుచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గ్రామాలను అభివృద్ధి చేయడానికి స్థిర సంకల్పంతో పని చేస్తున్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
