అభివృద్ధి మా కూటమి ప్రభుత్వం అజెండా..శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

Sesha Ratnam
2 Min Read
తుడా నిధులతో ప్రతిపల్లెకు సిసి రోడ్లు. తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి

తిరుపతి జిల్లా, రేణిగుంట మండలం గరుడ న్యూస్ ప్రతినిధి పాకాల మురళి: తమది చేతల ప్రభుత్వమే కానీ కోతల ప్రభుత్వం కాదని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రేణిగుంట మండలం వెంకటాపురం పంచాయితీలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి లు కలసి పర్యటించారు. ముందుగా అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బాలింతలకు శ్రీమంతం నిర్వహించి వారికి ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని అందజేశారు. కొంతమంది పిల్లలకు అన్నప్రాసన మరి కొంతమంది  పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఒక్క వెంకటాపురం పంచాయతీలోనే ఏడాది పాలనలో దాదాపు మూడు కోట్లు ఖర్చు చేసామన్నారు. గత ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒకసారి కూడా గ్రామాల్లో పర్యటించలేదని ప్రజల బాగోగులు చూడలేదని విమర్శించారు. నియోజకవర్గంలో పూర్తిగా రౌడీయిజాన్ని, రూపుమాపమని గంజాయి సరఫరాకు ఎక్కడకక్కడ అడ్డుకట్ట వేస్తున్నామని తెలియజేశారు. యువ నాయకులు మంత్రి లోకేష్ బాబు ఆలోచనకు అనుగుణంగా ప్రతినెల గ్రామాల్లో తిరుగుతూ ప్రత్యక్షంగా ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కరించడానికి కృషి చేస్తున్నామన్నారు. అభివృద్ధి మాత్రమే తమ అజెండా అని స్పష్టం చేశారు.


తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ అనునిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పరితపించే బొజ్జల సుధీర్ రెడ్డి లాంటి ఎమ్మెల్యే దొరకడం శ్రీకాళహస్తి ప్రజల అదృష్టమన్నారు. తుడా నిధులతో ప్రతి గ్రామానికి అనుసంధానిస్తూ సిసి రోడ్లు వేయడానికి ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. అదేవిధంగా నియోజకవర్గ పరిధిలో చెరువుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అవసరమైనచోట పార్కులను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గం నిర్దేశంలో యువ నాయకులు మంత్రి లోకేష్ బాబు సహాయ సహకారాలతో  శ్రీకాళహస్తి నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి పరుస్తామని తెలియజేశారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని ఆ పథకాలు ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుస్తున్నాయని చెప్పారు. ఆగస్టు నెల 15వ తేదీ నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కూడా అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని నిరూపిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *