

పార్వతీపురం, గరుడ న్యూస్ : సమాజంలో పేద, ధనిక తారతమ్యాన్ని తగ్గించి 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంకల్పించిన పి4 పథకం ద్వారా బంగార కుటుంబాలను గుర్తించి అభివృద్ధి చేద్దామని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పారిశ్రామికవేత్తలు, సంపన్నులకు పిలుపునిచ్చారు. పార్వతీపురం ఐటీడీఏ గిరిమిత్ర భవనంలో సమావేశం శనివారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే విజయ్ చంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఏ నాయకుడు ఆలోచించని విధంగా చంద్రబాబు పేదల అభివృద్ధికి పి4 పథకాన్ని తీసుకొచ్చారని పారిశ్రామికవేత్తలు, సంపన్నులు, సి ఎస్ ఆర్ నిధులతో పేదలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. పార్వతీపురం నియోజకవర్గంలో సుమారు 7000 బంగారు కుటుంబాలను గుర్తించగా, ఆ టార్గెట్ ను పూర్తి చేయడానికి అందరం కలిసికట్టుగా పనిచేద్దామని సూచించారు. తాను వ్యక్తిగతంగా కొన్ని కుటుంబాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ చంద్ర ప్రకటించారు. చంద్రబాబు సంకల్పం నెరవేరితే సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగిపోయి సుసంపన్నమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని తెలిపారు. పార్వతీపురం నియోజకవర్గంలోని పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, ఉన్నత ఉద్యోగులు, ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.
