
పులిచెర్ల మండలం పాతపేట పంచాయితీ పూరోడోళ్ళపల్లి వద్ద శనివారం ఉదయం ఆడ ఏనుగు మృతి చెందడం కలకలం రేపింది. ఏనుగు మృతి గురించి స్థానికులు అటవీ అధికారులకు తెలియజేశారు. చిత్తూరు జిల్లా అటవీశాఖ అధికారిని ధరణి సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తులతో ఏనుగు మృతి గురించి చర్చించారు. డాక్టర్లు చేరుకొని అక్కడే పోస్ట్మార్టం చేశారు. అనంతరం డిఎఫ్ఓ విలేకరులతో మాట్లాడుతూ 18 ఏనుగులు గుంపు సంచరిస్తున్నాయని అన్నారు. ఇందులో ఒక ఆడ ఏనుగు చెరువు కట్టమీదకి ఎక్కలేక కిందపడి తల విరిగినట్లు తెలిపారు. పోస్టుమార్టం నిర్వహించగా ఏనుగు మామిడి పళ్ళు ఎక్కువ తినడం వల్ల కడుపులో అసిడిటీ ఏర్పడిందని దీని ప్రభావం మిగతా అవయవాల మీద చూపించిందని వివరించారు. ఏనుగు మరణం దురదృష్టవశాత్తు జరిగిందని అన్నారు. ఈ ఆడ ఏనుగు 1,2 నెలల బిడ్డ కూడా ఉందని తెలిపారు. ఏనుగు మృతి చెందిన ప్రాంతానికి మిగతా ఏనుగులు ఏ సమయంలోనైనా రావచ్చని ప్రజల అప్రమత్తంగా ఉండాలని డిఎఫ్ఓ సూచించారు. ఒంటరిగా ఎవరూ తిరగవద్దని అన్నారు. అటవీ సిబ్బంది అప్రమత్తంగా ఉంటారని తెలిపారు. ఏనుగుల దాడి నుంచి పంటలను, ప్రజలను కాపాడేందుకు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని డిఎఫ్ అన్నారు. సోలార్ పెన్సిల్ ఎక్కువగా ఏనుగుల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తామని అన్నారు. ఏనుగు మృతి చెందినట్లు తెలియడంతో పలు ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చి సందర్శించారు. ఈ కార్యక్రమంలో అటవీ సిబ్బంది పాల్గొన్నారు.

