


మెగా రక్తదాన, వైద్య శిబిరాలు నిర్వహించిన అభిమానులు.
పార్వతీపురం, గరుడ న్యూస్ : ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర జన్మదిన వేడుకలు గురువారం అంగరంగ వైభవంగా జరిగాయి. వేలాది మంది అభిమానులు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తెలుగు మహిళలు పాల్గొని ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పార్వతీపురం రాయల్ కన్వెన్షన్ లో జరిగిన వేడుకల్లో బొబ్బిలి, కురుపాం, పాలకొండ ఎమ్మెల్యేలు బేబీ నాయన, తోయక జగదీశ్వరి, నిమ్మక జయకృష్ణ సహా పలువురు ప్రముఖులు విజయ్ చంద్రకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అధికారులు అనదికారులు పట్టణ ప్రముఖులు అక్కడికి చేరుకుని అభినందనలతో ముంచెత్తారు. అభిమానులు కేరింతలు సందడి మధ్య ఎమ్మెల్యే భారీ కేకు కత్తిరించి పంపిణీ చేశారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సందడి చేసిన విజయ్ చంద్ర అభిమానులు పార్వతీపురం పట్టణమంతా ఫ్లెక్సీలతో అలంకరించారు. అంతకుముందు మెగా రక్తదాన, వైద్య శిబిరాలను ఎమ్మెల్యే ప్రారంభించగా పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొని రక్తదానం చేశారు. అలాగే ఎమ్మెల్యే బర్త్డే సందర్భంగా నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి ప్రజల నుండి మంచి స్పందన లభించింది. ప్రముఖ వైద్య నిపుణులు శిబిరంలో పాల్గొని ప్రజలకు వైద్య సేవలు అందించారు. రోగులకు వైద్య, రక్త పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే విజయ్ చంద్ర నీతికి, నిజాయితీకి, పనితనానికి నిలువెత్తు నిదర్శనమని, నిరంతరం ప్రజల కోసం పరితపిస్తూ ఉంటారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే విజయ్ చంద్ర మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.
