

మంత్రి డోలా వీరాంజనేయలు స్వామి, ఎమ్మెల్యే విజయ్ చంద్రకు ఘన స్వాగతం పలికిన నిడగల్లు గ్రామ ప్రజలు
పార్వతిపురం : సీతానగరం మండలం, నిడగల్లు గ్రామ ప్రజలు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రకు ఘన స్వాగతం పలికారు. సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం కోసం గ్రామానికి వచ్చిన మంత్రి, ఎమ్మెల్యేకు గ్రామ పొలిమేరలో వేలాదిమంది ప్రజలు తరలివచ్చి పూల వర్షం కురిపించి ఆహ్వానించారు. భాజా భజంత్రీలు, కోయ డాన్సులతో అశేష జన వాహిని తమ అభిమాన నాయకులను గ్రామంలోకి తోడ్కొని వెళ్లారు. గ్రామ వీధుల్లో తిరిగిన ఎమ్మెల్యే, మంత్రికి అడుగడుగునా మహిళలు హారతులివ్వగా, యువకులు పూల వర్షం కురిపించారు. నిడగల్లు ప్రజల ఆదరాభిమానాలకు ముగ్దులైన ఎమ్మెల్యే, మంత్రి ఆనందం వ్యక్తం చేస్తూ ఈరోజు మరిచిపోలేనిదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ చంద్ర మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చిందా అని నిలదీశారు. ఏ ఒక్క పథకాన్ని నిజాయితీగా అమలు చేయలేని వైసీపీ నాయకులు సజావుగా సాగుతున్న ఎన్డీఏ పాలనపై కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి వస్తున్న ప్రజా స్పందన చూసి వైసిపి నాయకులకు నిద్ర పట్టడం లేదని విమర్శించారు. నిడగల్లు ప్రజల రుణం తీర్చుకునేందుకు సాయి శక్తులా ప్రయత్నిస్తానని, వేలాదిమంది ప్రజల హర్షద్వానాల మధ్య ఎమ్మెల్యే విజయ్ చంద్ర ప్రకటించారు. మంత్రి వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ గత ఎన్నికల్లో పార్వతీపురం ప్రజలు తెలుగుదేశం పార్టీకి తిరుగులేని మెజారిటీ ఇచ్చారని వారి రుణం తీర్చుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే విజయ్ చంద్ర చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



