
పార్వతీపురం, గరుడ న్యూస్ (జులై 26)
వాల్తేర్ డివిజన్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రాను ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. పూల బొకే అందజేసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. అనంతరం పార్వతీపురం జిల్లాలోని పలు రైల్వే సమస్యలను డిఆర్ఎం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా నర్సిపురం, బెలగాం స్టేషన్లలో కొన్ని రైళ్ల నిలుపుదల గురించి డిఆర్ఎంకు వివరించారు. గతంలో నర్సిపురం స్టేషన్లో గుంటూరు, దుర్గ్ ఎక్స్ ప్రెస్ రైళ్లు నిలిపే వారని, ఇటీవల వాటిని నిలపకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు డిఆర్ఎంకు తెలియజేశారు. అలాగే కొన్ని కొత్త ట్రైన్లు నర్సిపురం, బెలగాం స్టేషన్లలో ఆగడం లేదని, వాటి నిలుపుదలపై చర్యలు తీసుకుని ప్రజల ప్రయాణాలకు మార్గం సుగమం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన డిఆర్ఎమ్ బోహ్రా, అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.



