పంటలు పండించడంలో రైతు గెలిస్తేనే వ్యవసాయం నిలుస్తుందని, రైతు లేనిదే పంటలు పండవని, రైతులకు కూటమి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. మంగళవారం పార్వతీపురం మండలం బాలగుడబ గ్రామంలో కరీఫ్ వరి ఉబాలును ఆయన పరిశీలించి రైతులతో కలిసి వరి ఉబాలు నాటారు. రైతు అవతారం ఎత్తిన ఎమ్మెల్యేను చూసి నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు కష్టాన్ని గుర్తించే ప్రభుత్వం ఏదైతే ఉందో అదే మన కూటమి ప్రభుత్వం అని అన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో వరి పంట బాగా పండి ప్రతి రైతు సస్యశ్యామలంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.