

రాష్ట్రంలో ప్రతి కుటుంబంలోనూ ఒకరు పారిశ్రామిక వ్యాపారవేత్తగా ఎదగడం ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పమని ఆ దిశగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలను అమలు చేస్తుందని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పేర్కొన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పార్వతీపురంలో గురువారం శుభమస్తు కళ్యాణ మండపంలో నిరుద్యోగులు యువకుల కోసం నిర్వహించిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో 95% మంది ఉద్యోగులు కేవలం ఐదు శాతం మంది పారిశ్రామిక, వ్యాపారవేత్తల కోసం పనిచేస్తున్నారని తెలిపారు. అందరూ బాగా చదువుకుని ఉద్యోగం సంపాదించాలని తాపత్రయపడటం సరికాదని పారిశ్రామికవేత్తలుగా వ్యాపారవేత్తలుగా ఎదగాలని సూచించారు. రోడ్డు పక్క చిరు వ్యాపారం చేసుకునే వ్యక్తి రోజుకు వేలాది రూపాయల సంపాదిస్తారని ఏ ఉద్యోగి అంత మొత్తం సంపాదిస్తారో చెప్పాలని ప్రశ్నించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నిరుద్యోగులు యువకుల ఆలోచనలో మార్పు రావాలని కోరారు. పారిశ్రామిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు సీడాఫ్ సంస్థ అనేక అవకాశాలను కనిపిస్తోందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సదస్సు తర్వాత పార్వతీపురం లోని చాలామంది యువకులు పారిశ్రామిక వ్యాపారం రంగాల వైపు ముగ్గు చూపుతారని ఆశిస్తున్నట్లు ఎమ్మెల్యే విజయ్ చంద్ర పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీడాప్ – సర్ప్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రతినిధులు, సెంట్యూరియన్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్,నియోజకవర్గ , పట్టణ మరియు మండల ఔత్సాహిక యువత , కార్యకర్తలు పాల్గొన్నారు.
