
గరుడ న్యూస్ పెద్ద పంజని మండలం
జాతీయస్థాయి పర్యవేక్షణ బృందం అధికారులు శనివారం మండలంలోని కోగిలేరు సచివాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా అమలవుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, హౌసింగ్, పెన్షన్లు, స్వయం సహాయక సంఘాల రుణాల మంజూరుపై లబ్ధిదారులతో నేరుగా చర్చించారు. కేంద్ర ప్రభుత్వం నుండి పలు పథకాల ద్వారా మంజూరు అవుతున్న నిధులు నేరుగా లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వం నుండి మంజూరైన నిధులతో లబ్ధి పొంది సంతోషంగా ఉన్నారా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సలహాలు సూచనలు ఇవ్వాలని సూచించడంతో ఉపాధి హామీ వేతన దారులు పనులు చేసుకోవడానికి కొత్తగా పనిముట్లు ఇవ్వాలని, దినసరి వేతనం పెంచాలని కోరడంతో వారి అభ్యర్థన మేరకు ఉన్నతాధికారులకు నివేదికలు పంపనన్నట్లు తెలిపారు. అనంతరం గ్రామ పంచాయతీ అభివృద్ధి కొరకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న 15వ ఆర్థిక సంఘం నిధులు ఆ నిధులతో చేపట్టిన పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుండి మంజూరైన నిధులతో గ్రామపంచాయితీ పరిధిలో చేపట్టిన కొన్ని పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమేష్ బాబు, జాతీయస్థాయి పర్యవేక్షణ కమిటీ అధికారులు సునీల్, మణికంఠన్, ప్రశాంత్, ఇంచార్జ్ ఎంపీడీవో శారదా దేవి, ఏపీవో మురుగేషన్, ఏపీఎం నీరజ, పంచాయతీ కార్యదర్శి బాలాజీ, ఎంసీఓ సుధాకర్, సచివాలయ సిబ్బంది, నాయకులు నాగేశ్వరరావు, రామచంద్ర, బాలాజీ, శంకర్, పరమేశ్వర తదితరులు పాల్గొన్నారు.
