

పార్వతీపురం మండలం బాలగుడబ నుంచి వెంకటరాయుడిపేట వరకు నూతనంగా నిర్మించిన తారు రోడ్డును ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మంగళవారం ప్రారంభించారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం నిధులు 200 లక్షల వ్యయంతో ఇటీవల ఈ రోడ్డును నిర్మించారు. ఈ రోడ్డును ఎమ్మెల్యే విజయచంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల రహదారులపై నిర్లక్ష్యం వహించిందని, కూటమి ప్రభుత్వం ఆ రహదారులన్నీ పూర్తి చేయడం జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతంలో రోడ్లు అభివ్రుద్ది చేయడానికి కూటమి ప్రభుత్వం క్రుషి చేస్తోందని స్పష్టం చేసారు. గత ప్రభుత్వం రోడ్లను పట్టించుకోకపోవడంతో పల్లె ప్రజలు తీవ్ర ఇబ్బంది పడేవారని అన్నారు. ప్రతి గ్రామానికి రహదారిని వేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అందులో భాగంగానే ఈ రహదారిని నిర్మించడం జరిగిందని అన్నారు. ఈ తారు రోడ్డు ఏర్పాటు చేయడం పట్ల ఆ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టాలు నెరవేర్చిన ఎమ్మెల్యే విజయ్ చంద్రకు ప్రజలు కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



