పాచిపెంట రూరల్,ఆగస్టు 23,గరుడ న్యూస్
వైరస్ ద్వారా మిరప, ఆకుకూరలు,బొప్పాయి, ఇతర పంటలలో వచ్చే ఆకు ముడత నివారణకు, పత్తి మొక్కజొన్న, వరి పంటలలో రసం పీల్చు పురుగుల నివారణకు వావిలాకు కషాయం ఎంతగానో ఉపయోగపడుతుందని వ్యవసాయ అధికారి కే. తిరుపతిరావు అన్నారు. పిండ్రంగివలస గ్రామంలో రైతు భూపతి సింగరాజు క్షేత్రంలో వావిలాకు తయారీని పరిశీలించారు కొబ్బరి మరియు ఆయిల్ ఫామ్ లో పది ఎకరాలు అంతర పంటలుగా వేసిన కూరగాయలలో తెగుళ్ల నివారణ కోసం దశ పత్ర కషాయం వావిలాకు కషాయం తయారు చేసుకున్నానని పూర్తిస్థాయిలో ప్రకృతి సేద్య పద్ధతులలో పండిస్తున్నానని రైతు తెలిపారు.
వావిలాకు కషాయం తయారీ: ఐదు కిలోల వావిలాకులు 10 లీటర్ల ఆవు మూత్రంలో కలిపి ఒక గంట సేపు బాగా మరిగించి మధ్య మధ్యలో కలుపుతూ చల్లార్చిన తర్వాత వడగట్టి 500 గ్రాముల కుంకుడుకాయ రసాన్ని కలపాలి. అన్ని పంటలలో ట్యాంకుకు అర లీటర్ కలుపుకొని బాగా తడిచేటట్టు పిచికారీ చేసుకుంటే తామర పురుగులు మిరప లో వచ్చే ఆకు ముడత పత్తి, మొక్కజొన్న, కూరగాయలలో వచ్చే రసం పీల్చు పురుగులు మొదటి దశలలో ఉన్న లద్దె పురుగు,ఆకు తినే పురుగులు కాయ తోలుచు పురుగులను సమర్థవంతంగా నివారించవచ్చని మూడు నెలల వరకు నిల్వ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఆర్పి కర్రీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.




