
శ్రీకాళహస్తి నియోజకవర్గం (గరుడ న్యూస్ ప్రతినిధి) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సేవకులుగా, పారదర్శక పరిపాలనకు అంకితభావంతో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు నీతి, నిజాయితీ, నిబద్ధతతో పరిపాలన సాగిస్తున్నప్పటికీ, స్థానిక స్థాయిలో కొంతమంది రాజకీయ నాయకులు, అధికారులు ఆ విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనేది ఆందోళన కలిగించే అంశంగా మారింది.

శ్రీకాళహస్తిలో రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్న కొంతమంది స్థానిక నాయకులు, వాస్తవాలను రాసే సీనియర్ జర్నలిస్టుల జీవితాలపై దాడి చేస్తున్న తీరు తీవ్ర విమర్శలకు గురవుతోంది. జర్నలిస్టు గృహ నిర్మాణాలను కూడా వదలకుండా కూల్చివేయడం, పోలీసులను ఒత్తిడికి గురి చేసి జర్నలిస్టులను పోలీసుల కాళ్లు పట్టుకునే స్థితికి తేవడం ప్రజాస్వామ్యంలో అంగీకారానికి నొప్పించే అంశం.

తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా సేవ చేసిన సీనియర్ జర్నలిస్టు గృహాన్ని సైతం కూల్చివేయడం, ఈ ప్రాంతీయ రాజకీయాల కుళ్ళు, కుతంత్రాలకు పెద్ద నిదర్శనం. ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంబమైన మీడియాను ఇంత దారుణంగా అణగదొక్కడం పట్ల ప్రజలు ప్రశ్నలు వేస్తున్నారు.

గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు శుభ్రమైన పరిపాలన కోసం ఎంతో కృషి చేసినా, స్థానికంగా కొంతమంది వ్యక్తుల చేతుల మీదుగా అవి బూడిదలో పోసిన పన్నీరు అవుతున్నాయి. ఈ విధమైన అరాచకాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయి.

జర్నలిస్టులు సమాజానికి అద్దం పట్టేవారు. వారి గళాన్ని అణగదొక్కే ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి మచ్చతెస్తాయి. గౌరవనీయులు ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంపై తక్షణమే దృష్టి సారించి జర్నలిస్టులకు న్యాయం చేయాలని, స్థానిక స్థాయిలో జరుగుతున్న ఈ దుర్వ్యవహారాలను ఆపాలని ప్రజలు కోరుకుంటున్నారు.