
జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఉచిత ప్రత్యేక వైద్య శిబిరం
జిల్లా కలెక్టర్ డా. ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. భాస్కరరావు ఆధ్వర్యంలో, జిల్లా అంధత్వ నివారణ సంస్థ నేత్ర వైద్య అధికారి జీరు నాగేష్ రెడ్డి పర్యవేక్షణలో ప్రత్యేక ఉచిత నేత్ర వైద్య శిబిరం సోమవారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. పుష్పగిరి కంటి ఆసుపత్రి వైద్యనిపుణులు ఈ శిబిరంలో సేవలందించారు. శిబిరంలో మీడియా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు, కలెక్టర్ కార్యాలయం సిబ్బంది, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు సహా సుమారు 200 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించారు. దృష్టి దోషం, అంతరకుసుమం (క్యాటరాక్ట్), టెరిజియం (కొయ్యకండ), గ్లాకోమా (నీటికాసులు) తదితర కంటి వ్యాధులపై నిపుణులు సవివరంగా పరీక్షించారు. పరీక్షల్లో దగ్గర దృష్టి దోషం ఉన్న 100 మందికి కలెక్టర్ చేతుల మీదుగా ఉచిత కళ్లజోళ్లు పంపిణీ చేయగా, మిగతా వారికి త్వరలో అందజేస్తామని డా. భాస్కరరావు తెలిపారు. శిబిరంలో గుర్తించిన క్యాటరాక్ట్, టెరిజియం కేసులకు పుష్పగిరి కంటి ఆసుపత్రిలో రేపు ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రామ్ మేనేజర్ డా. సూర్య కౌశిక్, వైద్యశాఖ అధికారులు డా. జగన్మోహన్, డా. వినోద్ కుమార్, డా. రఘు కుమార్, జిల్లా ఎన్‌జీఓ అధ్యక్షుడు కిశోర్, ఆరోగ్య కార్యకర్తలు, ఆషా కార్యకర్తలు, పుష్పగిరి ఆసుపత్రి ప్రతినిధి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.



