చిత్ర పరిశ్రమలో విషాదం.. ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్‌ అధినేత శరవణన్‌ ఇకలేరు! – Garuda Tv

Garuda Tv
1 Min Read


ప్రముఖ నిర్మాత, ఎ.వి.ఎం. సంస్థ అధినేత శరవణన్‌(శరవణన్‌ సూర్య మణి) కన్ను మూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన డిసెంబర్ 4 గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. తమిళ్, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో 170కి పైగా సినిమాలు నిర్మించారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎవిఎం సంస్థకు ఒక విశిష్ట స్థానం ఉంది. చిత్ర నిర్మాణ రంగంలో కొత్త ఒరవడిని సృష్టించి పలు భారతీయ భాషల్లో ఎన్నో అపురూపమైన సినిమాలను ప్రేక్షకులకు అందించిన సంస్థ. ఎవిఎం సంస్థ గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ప్రేక్షకులు మెచ్చే సినిమాలు నిర్మిస్తూ వారి మనసుల్లో సుస్థిర కోసం సంపాదించుకుంది.

తెలుగులో సంసారం ఒక చదరంగం, ఆ ఒక్కటీ అడక్కు, మెరుపుకలలు, జెమిని, శివాజీ, లీడర్‌ సినిమాలకు శరవణన్‌ నిర్మాతగా వ్యవహరించారు. ఎవిఎం స్టూడియోస్‌ను స్థాపించిన దిగ్గజ వ్యవస్థాపకుడు ఎవి.మెయ్యప్పన్‌ కుమారుడు శరవణన్‌. తన తండ్రి స్థాపించిన నిర్మాణ సంస్థను దిగ్విజయంగా ముందుకు నడిపించి ఎన్నో అపురూపమైన సినిమాలను ప్రేక్షకులకు అందించారు శరవణన్. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలకుగాను ఎన్నో పురస్కారాలు అందుకున్నారు.

సినిమాలు నిర్మిస్తూనే 1986లో మద్రాస్‌ షరీఫ్‌గా ప్రజలకు కూడా సేవ చేశారు శరవణన్‌. ఇటీవలికాలంలో ఆయన ఆరోగ్య సమస్యల కారణంగా సంస్థకు సంబంధించిన కార్యకలాపాలను ఆయన కుమారుడు ఎం.ఎస్.కుగన్‌ చేశారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అత్యంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న సంస్థల్లో ఒకటైన ఎవిఎం సంస్థ విజయవంతంగా నిర్వహించిన శరవణన్ మరణం ఒక శకానికి ముగింపు పలికింది. శరవణన్ మృతి పట్ల సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని చెబుతున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *