మీరేమీ పతివ్రతలు కాదు.. సమంత రెండో పెళ్లిపై మాధవీలత ఎటాక్‌! – Garuda Tv

Garuda Tv
2 Min Read


2021లో నాగచైతన్యతో విడిపోయిన తర్వాత నాలుగు సంవత్సరాల పాటు ఒంటరిగా ఉన్న సమంత.. డిసెంబర్ 1న కోయంబత్తూరులో దర్శకనిర్మాత రాజ్‌ నిడుమోరును సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. రాజ్‌కి కూడా ఇది రెండో వివాహమే. వీరిద్దరూ పెళ్లి చేసుకున్న రోజు నుంచీ సమంతపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఓ పక్క అక్కినేని అభిమానులు సమంతను ట్రోల్ చేస్తుండగా, కొందరు సాధారణ మహిళలు, నటిమణులు కూడా సమంత తీరును తప్పుబడుతూ పోస్టులు పెడుతున్నారు.

నాగ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత అనారోగ్యంతో బాధపడుతున్న సమంత.. ఆ తర్వాత క్రమంగా కోలుకొని సినిమాల షూటింగ్‌లలో పాల్గొంటున్నారు. ఆమె అనారోగ్యంతో ఉన్నప్పుడు త్వరగా కోలుకోవాలని ఎంతో మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇప్పుడు వారే ఆమెను విమర్శించడం ఆశ్చర్యంగా ఉంది. ఈశా ఫౌండేషన్‌లో సంప్రదాయ పద్ధతిలో జరిగిన వీరి వివాహంపై కొందరు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నప్పటికీ, అంతకు మించి సమంతపై ట్రోలింగ్ జరుగుతోంది. అది రోజుకూ పెరుగుతూ వస్తోంది.

సినిమా రంగానికి సంబంధించిన విషయంనా, రాజకీయ రంగానికి చెందిన అంశమైనా తన స్పందన తెలియజేయడంలో ఎప్పుడూ ముందుంటారు నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత. ఇప్పుడు సమంతను విమర్శిస్తున్న ట్రోలర్స్‌కి రివర్స్‌లో ఘాటుగా సమాధానమిచ్చారు. సమంత పెళ్లి విషయంలో మాధవీలత చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. సమంత రెండో పెళ్లి చేసుకోవడంపై ఆమె ఎలా స్పందించారు, ట్రోలర్స్‌కి ఎలాంటి కౌంటర్ ఇచ్చారు అనేది తెలుసుకోడం.

‘పెళ్లిళ్లు స్వర్గంలోనే నిర్ణయించబడతాయి. రుణాలు తీరిపోతే విడిపోతారు. ఎవరికి నచ్చిన జీవితాన్ని వారు ఎంపిక చేసుకుంటారు. ఒకరినొకరు చంపుకోవడం లేదు కదా. ఆ విషయంలో మీరు సంతోషించాలి. సమంత పెళ్లి చేసుకుంటే కొందరు బాధపడుతున్నారు. మీకెందుకు అంత బాధ అనేది నాకు అర్థం కావడం లేదు. ఎవరి సంసారమో కూల్చేసింది అన్నట్టుగా కామెంట్ చేస్తున్నారు.

అలాంటి కామెంట్స్ చేసే వారు.. ముందు తమ పర్సనల్ లైఫ్‌లో ఎన్ని రిలేషన్ షిప్స్‌లో ఉన్నారో ప్రశ్నించుకోవాలి. మరొకరి సంసారాన్ని చెడగొట్టి పెళ్లి చేసుకునేవారు, విడాకులు ఇవ్వకుండానే వ్యవహారాలు నడిపేవారు ఇలాంటి కామెంట్స్ చేస్తుంటే నాకు నవ్వొస్తోంది. మీరేమీ పతివ్రతలు కాదు కదా. ఇలాంటి కామెంట్స్‌ చేసే వారి గురించి నాకు బాగా తెలుసు’ అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు మాధవీలత.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *