గ్రామాలను మింగేస్తున్న కాలుష్యం – రైతుల పంటలు నాశనం
మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్ వైశాలి

పార్వతీపురం మన్యం జిల్లా, గరుగుబిల్లి:
గరుగుబిల్లి మండలంలో కొనసాగుతున్న అత్యం మైనింగ్ అక్రమ కార్యకలాపాలు పరిసర గ్రామాల అస్తిత్వానికే ముప్పుగా మారాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మైనింగ్ వల్ల ఏర్పడుతున్న తీవ్రమైన కాలుష్యం కారణంగా పంటలు పండక రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ చిన్న గొడవ, పెద్ద గొడవ, కొంకడి వరం, గదబ వలస గ్రామాల ప్రజలు సీఎం పేషీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా యంత్రాంగం, మంగళవారం పార్వతీపురం సబ్ కలెక్టర్ ఆర్. వైశాలి ఆధ్వర్యంలో అత్యం మైనింగ్ ప్రాంతాన్ని, చుట్టుపక్కల గ్రామాలను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. మైనింగ్ వల్ల ఏర్పడుతున్న సమస్యలపై గ్రామస్తుల నుంచి వివరాలు తెలుసుకున్న సబ్ కలెక్టర్, మైనింగ్‌కు సంబంధించి పత్రాల్లో ఉన్న అనుమతులు, వాస్తవ పరిస్థితిని సమగ్రంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
గ్రామస్తుల ఆరోపణలు:
అత్యం మైనింగ్‌ను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. మైనింగ్ కోసం యాజమాన్యం చెరువులను కూడా కబ్జా చేసి, జంజావతి కాలువను కప్పివేసినట్లు వారు తెలిపారు. అంతేకాకుండా అనుమతి లేని ప్రాంతాల్లో కూడా మైనింగ్ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. మైనింగ్ ధూళి, మురుగు నీటి కారణంగా తమ పంట పొలాలు పూర్తిగా నష్టపోతున్నాయని, రైతులు ఉపాధి కోల్పోయే పరిస్థితి నెలకొందని గ్రామస్తులు వాపోయారు. ఈ అంశాన్ని ఎమ్మార్వో దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా స్పందన లేకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

వెంటనే మైనింగ్ నిలిపివేయాలని డిమాండ్:
అత్యం మైనింగ్‌ను వెంటనే నిలిపివేసి, కాలుష్యం నుంచి గ్రామ ప్రజలను, రైతులను రక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ప్రభుత్వమే జోక్యం చేసుకుని అక్రమ మైనింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.



