
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల వ్యవధిలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి మేమంతా ఆనందం వ్యక్తం చేస్తున్నామని పార్వతీపురం మండలం డోకిశీల పంచాయతీకి చెందిన గిరిజన ప్రజలు తెలిపారు. సోమవారం డోకిశీల పంచాయతీ గ్రామానికి చెందిన వైసీపీ సర్పంచ్ సంపంగి జగదీష్‌తో పాటు వార్డు సభ్యులు, నాయకులు మరియు సుమారు 100 కుటుంబాలు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ చేరిక కార్యక్రమానికి నీలాపు చంటి, నీలాపు కొండలరావు, వడ్డీ చంటి, సీదారపు రాజు, వేంపటాపు సంబమూర్తి, బలుసు నాగేశ్వరావు, డుంబరి రవి, బొమ్మి గౌరునాయుడు తదితరులు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర మాట్లాడుతూ, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. టీడీపీలో చేరిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, సముచిత స్థానాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తుండటం ఆనందంగా ఉందన్నారు. గతంలో ఎన్నడూ చూడని అభివృద్ధిని ఇప్పుడు చూస్తున్నామని తెలిపారు. పార్వతీపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎమ్మెల్యే మార్గదర్శకత్వంలో గ్రామాభివృద్ధికి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గొట్టపు వెంకట నాయుడు, బోను చంద్రమౌళి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



