
నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీల అభివృద్ధికి పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే విజయ్ చంద్ర పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజను కోరారు.పార్వతీపురం పర్యటనకు వచ్చిన కమిషనర్‌ను ఎమ్మెల్యే కలిసి మొక్కను బహూకరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీల ప్రస్తుత పరిస్థితులను కమిషనర్‌కు వివరించారు. పలు గ్రామ పంచాయతీల్లో మౌలిక సదుపాయాల కొరతతో పాటు అనేక సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.నియోజకవర్గంలో అనేక గ్రామాలు మారుమూల ప్రాంతాల్లో ఉన్నాయని, ఆయా గ్రామాలకు రహదారులు, ఇతర మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే తెలిపారు. పల్లెలే దేశాభివృద్ధికి పునాదులని, గ్రామాల అభివృద్ధిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.ఎమ్మెల్యే ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజ అవసరమైన మేరకు నిధుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.