గరుడ న్యూస్,సాలూరు
(ఇటీవల సామాజిక మాధ్యమాలలో వైరల్ అయిన శ్రీపతి నాగరాజు అనే ఒడియా బ్రాహ్మణ వ్యక్తి, సాలూరు కి చెందిన టీచర్…25 ఏళ్ల క్రితం ఉద్యోగ రీత్యా విజయనగరం లో సెటిల్ అయ్యారు. ఇంగ్లీషు ఉపాధ్యాయుడి ఆవేదన )
మహారాజశ్రీ గౌరవ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖామంత్రివర్యులకు నమస్కారములతో !
ఆర్యా!
నా మెయిల్ ఓపెన్ చేసినందుకు ధన్యవాదాలు. నా వయసు 51. ఇప్పటికి టీచర్ గా 28 ఏళ్ళ సర్వీస్ పూర్తయింది. ప్రస్తుతం విజయనగరం జిల్లా తంగుడుబిల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్ గా చేస్తున్నాను. కావాలనుకుంటే ఈ లెటర్ నేను ఇంగ్లీష్ లో పదాడంబరాలతో రాయొచ్చు. కానీ మనోవేదన తెలియజేయటానికి మాతృభాష ని మించింది లేదు.
కరోనా తర్వాత నుండి విద్యార్థుల్లో క్రమశిక్షణ లోపించింది అని చాలామంది అభిప్రాయం. అది కొంత వరకు సరియైనది కావచ్చు. కానీ కరోనా ని మించిన పాండమిక్ ఏంటంటే ” 10వ తరగతి లేదా ఇంటర్ పరీక్షలలో 100% పాస్ ” అనే ఒక అహేతుక నినాదం గత 10-15 ఏళ్ళు గా మన విద్యావ్యవస్థలో నాటుకుపోయింది. దీని వలన పరీక్షల నిర్వహణ, స్పాట్ వేల్యుయేషన్ లలో ఉదారహంగా వ్యవహరించాలనే పెడ ధోరణి పెరిగిపోయింది. కచ్చితంగా ఇన్విజిలేషన్ డ్యూటీ,స్పాట్ వాల్యుయేషన్ డ్యూటీ చేసే టీచర్ల పై భౌతిక, సైద్ధాంతిక దాడులు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి.
ఈరోజు విద్యార్థుల కి టీచర్లు పొర్లు దండాలు పెట్టే రోజు రావటానికి కారణం ఈ ఉదారతే.
మనం చదువుకునే రోజుల్లో పదవ తరగతి లేదా ఇంటర్ లలో 40%- 50% రిజల్ట్ వచ్చినా , నాణ్యత , క్రమశిక్షణ కలిగిన విద్యార్తులు పాస్ అయ్యేవారు. వాళ్లే ప్రస్తుతం సంఘంలో బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నారు. అన్నిరకాల ప్రైవేట్ కళాశాలలు ఇబ్బడిముబ్బడిగా పెరిగి లక్షల కొలదీ సీట్లు అందుబాటులోకి రావటం వలన, వాటిని పూరించటానికి ఎక్కువ మంది విద్యార్థులు కావాలి కాబట్టి ఈ 100% పాస్ అనే అహేతుకమైన విధానం ఆవిర్భవించింది. ఎడ్యుకేషనల్ సైకాలజీ ప్రకారం విద్యార్థుల అందరికీ ఒకే ఐక్యూ ఉండదు. ఇండివిజ్యువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. మరి అలాంటపుడు 100% పాస్ ఏవిధంగా సంభవం. కేవలం పరీక్షల నిర్వహణలో, స్పాట్ వాల్యుయేషన్ లో ఉదారత వలనే ఇది సాధ్యమైంది. అందుకే ఒకప్పుడు 7 వ తరగతికి పబ్లిక్ ఎగ్జామ్ ఉండేటపుడు 50%-60% ఉత్తీర్ణత వచ్చేది. 8వ తరగతి లో కి క్వాలిటీ, క్రమశిక్షణ ఉండే విద్యార్థులు జాయిన్ అయ్యేవారు. వారు 10 వ తరగతి , ఇంటర్ లో బాధ్యతాయుతంగా ఉండేవారు. మంచి విద్యార్థులుగా ఎదిగేవారు.
ఎప్పుడైతే 7వ తరగతి పరీక్షల నిర్వహణలో , స్పాట్ వాల్యుయేషన్ లో ఉదారత, పెడ ధోరణి పెరిగిందో , అందులో కూడా 100% పాస్ రిజల్ట్ కి చేరుకున్నాం. ఏకంగా సుమారు 2008 నుండి 7వతరగతికి పబ్లిక్ పరీక్షలు రద్దుచేసేశారు. ఇపుడు ఆ ధోరణి 10వతరగతి, ఇంటర్ లలో పెరిగింది.
క్వాంటిటీ రిజల్ట్ కంటే క్వాలిటీ రిజల్ట్ కావాలని ప్రభుత్వం అనుకుంటే, పరీక్షల నిర్వహణ నుండి స్పాట్ వాల్యుయేషన్ వరకూ అందరూ అంతఃకరణ శుద్ధితో పనిచేసి, మంచి క్రమశిక్షణ గల విద్యార్థులను సమాజం లోకి మనం పంపగలం.
సమాజం అంటే లెక్కలేని, టీచర్లంటే గౌరవంలేని, చదువంటే విలువ తెలియని, తల్లిదండ్రులంటే భయం లేని పోకిరీ విద్యార్థులకి క్రమశిక్షణ అవసరం , బ్రతుకంటే భయం ఏంటో తెలియజెప్పే 10 వ తరగతి పరీక్షలలో, అంతఃకరణ శుద్ధితో, విద్యార్థికి బలమైన భవిష్యత్ కు పునాది అయిన 10వ తరగతి పరీక్షల నిర్వహణ లో అధికారులు, టీచర్లు – కష్టపడి చదివే విద్యార్థి మనసు గాయపడకుండా, పోకిరీ వేషాలు వేసే వారికి బుద్ధి చెప్పే విధంగా ఇన్విజిలేషన్ డ్యూటీ,స్పాట్ వాల్యుయేషన్ నిర్వహించే విధంగా,
మా శాఖామంత్రిగా మాకు నైతిక మద్దతు ఇవ్వండి. గత కొన్నేళ్ళుగా 100% రిజల్ట్ అనే జాడ్యం వలన ప్రతీ పోకిరీ విద్యార్థీ పాస్ అయి బయటకి వచ్చి, సమాజంలో ఆడవాళ్ల పట్ల లైంగిక దాడులు కూడా చేస్తున్నారు. వాడు స్కూల్ ముందే కాలర్ ఎగరేసి తిరుగుతుంటే, వాడ్ని చూసి జూనియర్ విద్యార్థి కూడా చెడిపోతున్నాడు. “ఆ వెధవే పాస్ అవగాలేనిది, మనం పాస్ అవలేమా”అనే నిర్లక్ష్య ధోరణి లో క్లాస్ లో మరింత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నాడు. విద్యార్థులకు పొర్లుదండాలు పెట్టి , ఉపాధ్యాయుని గౌరవం తగ్గించుకునే పెడధోరణుల కంటే, ఇన్విజిలేషన్ లోనూ, స్పాట్ వాల్యుయేషన్ లోనూ అనవసర ఉదారత చూపించకుండా కష్టపడి చదివి రాసే విద్యార్థి మనోభావాలు గాయపడకుండా డ్యూటీ చేస్తే చాలు…. అలా పాస్ అయిన వాడ్ని చూసి, జూనియర్ ప్రభావితం అవుతాడు. టీచర్లని, చదువుని, తల్లిదండ్రులనీ గౌరవిస్తూ మంచి క్రమశిక్షణ గలవాడిగా ఎదుగుతాడు. ఒకప్పుడు అదే జరిగేది. అందుకే నేను టీచర్ గా కనీసం ఎదగగలిగాను.
100% పాస్ అనే అసంబద్ధ , అహేతుక విధానాన్ని తిప్పికొడదాం. ఆలోచించండి !
ఇట్లు,
తమ విధేయుడు,
శ్రీపతినాగరాజు
9440599788
ఇది లేఖ సారాంశం….




