
తిరుపతి శ్రీ శృంగేరి శంకరమఠంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పురోహిత సమాఖ్య ఆధ్వర్యంలో గురుపూజోత్సవం సందర్భంగా చతుర్వేద పండితులకు ఘన సన్మానం చేశారు. ఋగ్వేద పండితులు చండూరి సీతారామ శర్మ, యజుర్వేద పండితులు దైత మల్లికార్జున అవధాని, సామవేద పండితులు గణేశ శౌత్రి, అధర్వణ వేద పండితులు బలభద్ర ఉపాధ్యాయ దంపతులను సన్మానించారు. ఈ సందర్భంగా విచ్చేసిన పండితులను పురోహితులు వేదమంత్రాలు పటిస్తూ పూర్ణకుంభ స్వాగతం పలికారు. గణపతి పూజ, జగద్గురు ఆది శంకరాచార్యుల పూజ నిర్వహించారు. అంతరం వేద పండితులను ఆహ్వానించి పాదాలు కడిగి పూజించి సత్కరించారు. ఈ సందర్భంగా వేద పండితులు పురోహితులకు వేద ఆశీర్వచనం చేశారు. పండితులు మాట్లాడుతూ వేదం, ధర్మం ఆచరించే విధానాలు గురించి వివరించారు. వేదం వల్ల ధర్మం, ధర్మం వల్ల శాంతి సౌఖ్యాలు, సౌభాగ్యము చేకూరుతుందన్నారు. బ్రాహ్మణులు వేదాధ్యయనం చేయాలని అన్నారు. మానవాళి ధర్మం వైపు పయనించాలని అప్పుడే శాంతి, సౌభాగ్యం, సుభిక్షంగా ఉంటామని అన్నారు. రాష్ట్ర పురోహిత సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు మొగిలి నారాయణమూర్తి మాట్లాడుతూ చతుర్వేద పండితులను గురుపూజోత్సవం సందర్భంగా చతుర్వేద పండితులను సన్మానించడం మునిపెన్నడు జరగలేదని రాష్ట్రంలో మొట్టమొదటిసారి జరగడం ఇదేనని కొనియాడారు. వేద పండితులకు పురోహిత సమాఖ్య జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో సమాఖ్య ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు మందవాసి మహేష్ శర్మ, సాయి కృష్ణ శర్మ, శ్రీకాంత్ శర్మ, నవీన్ కుమార్ శర్మ, కట్ట బాలసుబ్రమణ్యం శర్మ, సుమన్ కుమార్ శర్మ, మునిరాజు శర్మ, అరిపిరాల శ్రీనివాసులు ప్రసంగించారు.


