
జిల్లాలో తాగునీటి సమస్య ఉండరాదు

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు, ఉపాధ్యాయుల కొరకు వేచి ఉండరాదని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల కొరత ఉన్న చోట సర్దుబాటు చేసుకోవాలని విద్యా శాఖాధికారిని ఆదేశించారు. ప్రతీ ఒక్క ఉపాధ్యాయుడు తప్పకుండా విధులకు హాజరుకావాలని, హాజరుకానట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే విద్యార్థులు రెండు, మూడు రోజులు పాఠశాలలకు హాజరు కానట్లయితే, వారి బాగోగులు తెలుసుకొని, అవసరమైతే వైద్య సిబ్బందిని పంపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాల కారణంగా నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న కాలువలు, గెడ్డలు, వాగులు దాటే సమయంలో విద్యార్థులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని, అటువంటి సమయంలో అవసరమైతే విద్యార్థులకు సెలవును ప్రకటించాలని సూచించారు. శిధిలావస్థకు గురై, పెచ్చులూడి, స్లాబ్ పాడై పడిపోయేలా ఉండే పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులు, పిల్లలు ఉండరాదని అన్నారు. అటువంటి వివరాలు తెలుసుకొని మరమ్మతుల అంచనాలను రూపొందించి, తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. బడి బయట పిల్లలు ఉండరాదని,అటువంటి వారిని గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలని పేర్కొన్నారు. కొందరు తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం అందక పోవడానికి గల కారణాలు తెలుసుకొని వివరాలు సమర్పించాలని సూచించారు. ప్రతీ మండల తహసీల్దార్ మార్గదర్శి కింద వసతి గృహల్లో సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. అలాగే సచివాలయ సిబ్బంది అందరూ మరో వసతి గృహాన్ని దత్తత తీసుకొని, అక్కడి సమస్యలను పరిష్కరించాలని స్పష్టం చేశారు. జిల్లాలో తాగునీటి సమస్య ఉండరాదని, సమస్యలు ఉన్న చోట తక్షణమే పరిష్కరించాలని, ఎప్పటికప్పుడు నీటి పరీక్షలు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం వద్దని, వీలైనంత త్వరగా జారీచేయాలని మండల అధికారులకు తెలిపారు. ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడంలో పంచాయతీ శాఖ క్రియా శీలకంగా ఉండాలని, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. పీ 4 గ్రామసభలు జరుగుతున్నాయని, అన్ని చోట్ల సభలను పారదర్శకంగా నిర్వహించి, జాబితాలో మార్పులు, తొలగింపులు, కొత్త నమోదు ప్రక్రియను పక్కాగా చేపట్టాలని అన్నారు. బంగారు కుటుంబాలకు మార్గదర్శులను గుర్తించాలని, ఇందుకు ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోబిక, ఐటీడిఏ ప్రాజెక్ట్ అధికారి అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్ఓ కె.హేమలత, ఎస్డీసీ డా. పి.ధర్మచంద్రా రెడ్ది, డీఆర్డిఏ పీడీ యం.సుధారాణి, ఇతర జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
