Garuda news peddapanja mandal
ఎలాంటి చర్చలకు తావు లేకుండానే పెద్దపంజాణి మండల సర్వసభ్య సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. పెద్దపంజాణి మండల సర్వసభ్య సమావేశం సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మధ్యాహ్నం మూడు గంటలకు జరిగింది. స్థానిక ఎంపీపీ రెడ్డప్ప అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తాను దళితుడని అవమానించి స్థానికంగా ఉన్న కొందరు తనపై తప్పుడు నివేదికలు అందించి వైసిపి పార్టీ నుంచి తనని సస్పెండ్ చేయడం తనకు చాలా బాధ కలిగించిన విషయమని దీంతో సభను ముగిస్తున్నట్లు ఎంపీపీ రెడ్డప్ప ప్రకటించారు. దీంతో పెద్దపంజాణి మండల సర్వసభ్య సమావేశం ఎలాంటి ప్రగతి నివేదికలు, ఎలాంటి చర్చలకు తావు లేకుండా అర్ధాంతరంగా ముగిసింది. సభ ప్రారంభమైన వెంటనే వైసీపీ ఎంపీటీసీలు ఒక కోటి ఒక లక్ష రూపాయలు విలువ చేసే పనులు ఎంపీటీసీల అనుమతులు లేకుండానే పనులు జరిపించారని దీనికి సరైన సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. అనంతరం వీరప్పల్లి ఎంపీటీసీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వైసిపి హయాంలో ఏకైక తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీగా ఉన్న తనను అవమానించారని ఇప్పుడు మాత్రం వైసీపీ ఎంపీటీసీలు సభా మర్యాదలు, ప్రోటోకాల్ గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. సమావేశం అర్ధాంతరంగా ముగిసిన వెంటనే వైసీపీ ఎంపీటీసీలు ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా బైటాయించి సర్వసభ్య సమావేశం అర్ధాంతరంగా ముగించిన ఎంపీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మండల పరిధిలో వివిధ శాఖలలో జరిగిన అవకతవకలు బయటపడతాయని అర్ధాంతరంగా సర్వసభ్య సమావేశాన్ని ముగించారని నినాదాలిచ్చారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంపీపీ రెడ్డప్ప, డిప్యూటీ ఎంపీడీవో శారదా దేవి మాట్లాడుతూ 99 లక్షల ఇరవై రెండు వేల రూపాయలతో మండలంలో 47 పనులకు గాను 42 పనులు పూర్తి చేశామని ఐదు పనులను ఇంకా మొదలు పెట్టలేదని విలేకరులకు తెలిపారు. పూర్తిగా ఎంపీటీసీల ఎజెండా ఆమోదంతో అభివృద్ధి పనులను చేసినట్లు డిప్యూటీ ఎంపీడీవో పేర్కొన్నారు. ఈ సమావేశంలో తాసిల్దార్ హనుమంతు, పెద్దపంజాణి వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షులు శ్రీరాములు, జడ్పిటిసి సుష్మ, ఎస్సై ధనుంజయ రెడ్డి, అన్ని శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు, శాశ్వత ఆహ్వానితులు పాల్గొన్నారు.




